తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు పవన్ కల్యాణ్. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం తెలంగాణలో వరద బాధితుల సహాయం కోసం తాను ప్రకటించిన విరాళం కోటి రూపాయల చెక్కుని రేవంత్ కి అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ని కూడా రేవంత్ రెడ్డి సన్మానించారు. నంది మొమెంటోని బహూకరించారు.
ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు మారిన తర్వాత రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఇటీవల హైడ్రా గురించి పవన్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చొరవను ప్రశంసించారు. కొన్ని మార్పులు చేర్పులతో అలాంటి వ్యవస్థ ఏపీకి కూడా ఉండాలన్నారు పవన్. ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై కూడా వారిద్దరూ చర్చలు జరిపినట్టు సమాచారం.
https://x.com/JanaSenaParty/status/1833734251445158260
ఇటు ఏపీ వరదలపై కూడా డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ పెట్టారు. కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాల పంట నీట మునిగిందని డిప్యూటీ సీఎం కు తెలిపారు కలెక్టర్. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల రాకపోకలు స్తంభించాయని వివరించారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాలను దారి మళ్లించామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ కి సూచించారు పవన్. వరదల్లో చిక్కుకున్న ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించాలని చెప్పారు. అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలు తరలించాలని, సహాయక చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పవన్.