ఏపీలో వరదలతో బెజవాడ విలవిల్లాడిపోయింది. అటు తెలంగాణలో ఖమ్మం వణికిపోయింది. ఈ జల విలయానికి కారణమైన వాయుగుండం ప్రభావం తగ్గినా.. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో గండం రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. అయితే తాజా వాయుగుండం దిశ మార్చుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు సేఫ్ అని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల ప్రభావం మాత్రం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటే అవకాశముందని ఇటీవల వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే అది ఇప్పుడు దిశను మార్చుకుంది. వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిషా, బెంగాల్ తీరానికి చేరుకుంటుదని తాజాగా వాతావరణ విభాగం అంచనా వేసింది. రాబోయే మూడు రోజులు ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం తప్పిపోయినా.. ఆ ప్రభావం ఏపీపై ఉంటుందని ఈనెల 8 వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు పడతాయని హెచ్చరించింది.
విజయవాడ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతోపాటు, కృష్ణానది, బుడమేరు వరద లోతట్టు ప్రాంతాలను ముంచింది. ముఖ్యంగా ఈసారి బుడమేరు ప్రభావంతో విజయవాడ విలవిల్లాడింది. ఇది మానవ తప్పిదమా కాదా అన్న విషయంపై రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న వేళ రెండో వాయుగుండం వార్తలు బెజవాడ వాసుల్ని కలవరపెట్టాయి. ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాలనుంచి ఇళ్లకు చేరుకుంటున్నవారంతా మళ్లీ వరదలు వస్తాయేమోనని ఆందోళనకు గురయ్యారు. అటు బుడమేరులో ప్రవాహం పెరిగిందని, కొల్లేరు గ్రామాలపై పడుతోందనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. ఈ దశలో వాయుగుండం వల్ల భారీ వర్షాలు పడితే అది మరింత పెద్ద విపత్తుగా మారే అకాశముంది. కానీ వాయుగుండం బెంగాల్ తీరంవైపు వెళ్లిపోవడంతో ఏపీకి ముప్పు తప్పినట్టే చెప్పుకోవాలి.