మంచి రోజు చూసుకుని జనసేనలో చేరతానన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. మంగళగరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. జగన్ ని నమ్ముకుని రాజకీయం చేసి ఆస్తులన్నీ కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని.. ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. వైసీపీకి భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు బాలినేని. జగన్ కోసం పదవులకు రాజీనామాలు చేసి త్యాగాలు చేసినా.. తమను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు బాలినేని.
పవన్ కల్యాణ్ తమకు రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా ప్రకాశం జిల్లాల్లో జరిగిన సభల్లో తన గురించి మంచిగా ప్రస్తావించారని, కనీసం జగన్ కూడా అలా ప్రస్తావించలేదన్నారు బాలినేని. ప్రస్తుతం పవన్ తో జరిగిన భేటీలో తాను ఎలాంటి డిమాండ్లు ఉంచలేదని చెప్పారు. త్వరలో మంచి రోజు చూసుకుని జనసేనలో చేరతానన్నారు. తనతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు జనసేనలో చేరతారన్నారాయన. పవర్, పదవి తనకు అవసరం లేదని.. గౌరవం చాలని చెబుతున్నారు బాలినేని.
మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ ని చూసే తామంతా జగన్ వెంట నడిచామని, అయితే తమకు జగన్ పాలన నచ్చలేదన్నారు సామినేని. తమ సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా ఎలాంటి పనులు చేయించలేకపోయామన్నారు. తనను ప్రోత్సహించే అవకాశం వచ్చినా జగన్ పట్టించుకోలేదని వాపోయారు. తానింకా వైసీపీకా రాజీనామా చేయలేదని.. కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించి రాజీనామా చేస్తానని, ఆ తర్వాత జనసేనలో చేరతానని ప్రకటించారు.