ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేస్తోంది. అయితే, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తరుచుగా బయటపడుతూనే ఉంది. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం వల్ల బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కూడా చిక్కులు కలుగుతున్నాయి. తాజాగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు యడ్లపాటి రఘునాథ రావు అన్నారు. భూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కారానికి ఆ చట్టాన్ని తెస్తున్నట్లు ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే తమను అడిగితే చెప్పేవాళ్లమని, ఎన్నికల్లో తమతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ఈ చట్టం ఇతర రాష్ట్రాల్లో అమలవుతోందని, ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.
ఈ దుష్ప్రచారంపై ఈసీ కూడా ప్రతిస్పందించిందని, ఈసీ సూచన మేరకు సీఐడీ దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల కోసం చాలా డబ్బులు కావాలని అంటూ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేయకపోతే తమపై నిందలు పడుతాయని ఆయన అన్నారు.