ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ త్వరలోనే మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ పొత్తులు పెట్టుకొని దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు అందరూ.. ఈ పొత్తు వల్ల జనసేన నష్టపోతోందని.. కేవలం.. పవన్‌కి చంద్రబాబు 25 సీట్లు మాత్రమే కేటాయిస్తున్నారని అంటున్నారు. కానీ… పవన్ ఎంత నష్టపోతున్నాడు అనే విషయాన్ని పక్కన పెడితే.. తెలుగు తమ్ముళ్లకు మాత్రం తీరని నష్టం జరుగుతోంది అనేది అక్షర సత్యం.
ఇప్పుడు పొత్తు కింద జనసేనకు 25 సీట్లు కేటాయించడం అంటే… ఆ సీట్లలో టీడీపీ నేతలు ఎవరూ పోటీ చేయడానికి లేదు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ తమ్ముళ్ళు కొనేళ్లుగా పాతుకుపోయున్నారు. వారందరూ సీటుపై ఆశలు వదలుకోవాల్సిందే. మరొకరి గెలుపు కోసం వారే స్వయంగా కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు తమ్ముళ్ళు కోల్పోయే సీట్లలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ సీటు కూడా ఉండటం గమనార్హం.
జనసేన పొత్తుతోనే ఇలా ఉందిరా బాబు అంటే.. ఇప్పుడు బీజేపీ కూడా తయారైంది. టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరబోతోందని ఎల్లోమీడియా ప్రకటించేసింది. మొత్తంమీద 15 అసెంబ్లీ, 10 పార్లమెంటు సీట్లను బీజేపీ అడగబోతోందని వార్తలు వస్తున్నాయి. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందుపురం పార్లమెంటు స్థానాలు అడగటానికి ప్రతిపాదనలు రెడీ చేసిందట. మరి ఫైనల్‌గా బీజేపీ ఎన్నిసీట్లు అడుగుతుంది, చంద్రబాబు ఎన్నింటికి అంగీకరిస్తారన్నది తెలియాల్సి ఉంది.
అదే జరిగితే.. బీజేపీ నేతలు మహా మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. వారికి కావాల్సిన సీట్లు కచ్చితంగా సాధించుకుంటారు. నేడు అమిత్ షాతో బాబు మీటింగ్ కూడా ఈ పొత్తుల వ్యవహారం గురించి తేల్చడానికే అని తెలుస్తోంది. బీజేపీతో అవసరం చంద్రబాబుకు ఉందేకాని చంద్రబాబుతో బీజేపీకి ఏమీ అవసరంలేదు. నిజానికి బీజేపీకి ఉన్న బలం సున్నామాత్రమే. అయినా కమలం పార్టీతో పొత్తుకు చంద్రబాబు ఎందుకింతగా పరితపిస్తున్నట్లు? ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ అండ ఉన్నంతవరకు జగన్‌ను ఓడించటం తమవల్ల కాదని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే 1 శాతం ఓట్ షేర్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. మరి.. బీజేపీ ఎన్ని సీట్లు లాక్కుంటుందో.. ఎంత మంది తెలుగు తమ్ముళ్లు గుండెలు పగిలిపోతాయో చూడాలి.