అమలాపురం కలెక్టరేట్ సమీపంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ వల్ల పేలుడు సంభవించిందని ముందు అనుకున్నా.. బాణసంచా అసలు కారణమని తేలింది. పెద్ద మొత్తంలో ఓ భవనంలో బాణసంచా తయారీకి వాడే ముడిసరుకు నిల్వ చేయడం వల్లే పేలుడు జరిగిందని అంటున్నారు పోలీసులు.
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కలెక్టరేట్ కి అతి సమీపంలో రావులచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం నేలమట్టం అయ్యింది. ఈ ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో చేర్చినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పేలుడు ధాటికి సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బిల్డింగ్ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చనే అనుమానాలతో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. నివాస సముదాయాల వద్ద బాణసంచా నిల్వ ఉంచడమే నేరం అయితే అంతకంటే ఎక్కువ ప్రభావం ఉన్న ముడి పదార్థాలను దాచి ఉంచారు. వాటి వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేకపోయినా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.