బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ట్రాప్‌లో ఉన్నారంటూ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. హైడ్రా పేరుతో హైదరాబాద్ ఇమేజ్‌ను రేవంత్ డ్యామేజ్ చేస్తున్నారన్న కౌశిక్ రెడ్డి.. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి పెట్టుబడులను అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రజలు గమనించాలన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ అన్ని ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుందన్నారు.
అరెకపూడి గాంధీతో వివాదంపైన మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. తనపై గాంధీని దాడికి ఉసిగొలిపింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గాంధీ వాడిన భాష ఏంటని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. పీఏసీ ఛైర్మన్‌గా హరీష్ రావును పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిందని, హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, గంగుల పేర్లను నామినేట్ చేసిందన్నారు కౌశిక్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ నామినేట్ చేసిన వారిని కాదని గాంధీకి PAC ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. 13 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎలక్షన్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు అరెకపూడి గాంధీకి భయం ఎందుకని ప్రశ్నించారు.
సెటిలర్లంటూ వాడిన పదంపై క్లారిటీ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. తనను రెచ్చగొట్టడంతోనే గాంధీని వ్యక్తిగతంగా అన్నానని, ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రజలపై పై తనకు గౌరవం ఉందన్నారు. గతంలో ఆంధ్రా సెటిలర్స్‌కు కాలిలో ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్న విధంగానే పదేళ్ల కేసీఆర్ పాలన కొనసాగిందని గుర్తుచేశారు. ఇది అరెకపూడికి, తనకు జరుగుతున్న వ్యక్తిగత యుద్ధమన్నారు కౌశిక్ రెడ్డి.