బుడమేరుకి గండి పడిందంటూ మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. దీంతో సింగ్ నగర్, న్యూ ఆర్.ఆర్ పేట, జక్కంపూడి కాలనీ, పాయకాపురం, కండ్రిక వాసులు వణికిపోయారు. కొంతమంది ఇళ్లనుంచి బయటకు వచ్చి ఇరుగు పొరుగువారిని ఆరా తీశారు. నీటి జాడ కనపడితే అక్కడినుంచి వెంటనే వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది సామాను కూడా సర్దుకున్నారు. అయితే అంతలోనే అవి వట్టి పుకార్లని తేలడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బుడమేరుకు మళ్లీ వరద వచ్చిందని, కొద్దిసేపట్లో వరదనీరు కాలనీళ్లోకి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంత్రి నారాయణ ఈ వార్తలపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నారు. బుడమేరుకి వరదనీరు రావడం లేదని, గండ్లు పడే అవకాశం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని తేలింది. వెంటనే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు మంత్రి. పుకార్లపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరోవైపు ఈ పుకార్లకు కారణం ఎవరని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇటీవల బుడమేరుకి గండ్లు పడి పరివాహక ప్రాంతాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన మూడు గండ్లను అధికారులు పూడ్చివేశారు. మరోవైపు వరద ప్రవాహం కూడా తగ్గింది. దీంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతలోనే మళ్లీ వరదలంటూ పుకార్లు రావడంతో స్థానికులు హడావిడి పడ్డారు. తీరా అది ఫేక్ న్యూస్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.