వరదసాయంలో కులాల పట్టింపు ఉంటుందా..? సాయం చేయడానికి వచ్చినవాళ్లు, నీట మునిగిన కాలనీల్లో ఇళ్లు క్లీన్ చేయడానికి వచ్చినవారు పేరు, క్యాస్ట్ అడుగుతున్నారా..? టీడీపీ నాయకుల ఇళ్లు, ఆ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ముందుగా క్లీన్ చేస్తున్నారా..? ఫలానా కులం వారయితే ఎక్కువమంది మనుషులను పంపి మరీ వారి ఇళ్లు శుభ్రం చేయిస్తున్నారా..? ఈ ప్రశ్నలకు ఏపీ పోలీసులు సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. అది ఫేక్ న్యూస్ అని చెప్పారు. అలాంటి ప్రచారాన్ని తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఈమేరకు ఏపీ పోలీసులు ఓ ట్వీట్ వేశారు.
https://x.com/APPOLICE100/status/1831591891550220449
వర్రా రవీంద్రారెడ్డి పేరుతో వచ్చిన ఓ ట్వీట్ కి ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ బదులిచ్చింది. విపత్కర సమయాల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరం అని పేర్కొంది. వరదల కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతుంటే కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఎవరూ క్షమించరంటూ ట్వీట్ వేశారు పోలీస్ అధికారులు. ఇలాంటి పరీక్షా సమయంలో విద్వేషాన్ని, వదంతుల్ని వ్యాపింపజేసే, సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆమధ్య వరదల సందర్భంగా ఓ కార్టూన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫలానా క్యాస్ట్ వారికే ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డ్ లు విజయవాడలో అక్కడక్కడా కనపడతాయనే ప్రచారంపై ఆ కార్టూన్ వేశారు. మీ ఇల్లు ఫలానా కులం వారికే అద్దెకిస్తామని బోర్డ్ పెట్టారు కదా, మరి నా కులం వేరు, వరద నీటిని దాటించడానికి నా పడవ ఎక్కుతారా..? అంటూ ఇంటి ఓనర్ ని ఓ వ్యక్తి అడిగినట్టుగా ఆ కార్టూన్ ఉంటుంది. అక్కడ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే వరద సాయానికి, కులానికి ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం పోలీసులు తీవ్రంగా ఖండించారు.