కాపులను అన్ని విధాలుగా అణగదొక్కింది చంద్రబాబేనని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూశాడని ధ్వజమెత్తారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. కాపులకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
బాబు కుట్రలను కాపు జాతి మరిచిపోదు..
కాపులను జగన్ దగా చేశారంటూ చంద్రబాబు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని, కానీ కాపులను అన్ని రకాలుగా వేధించింది.. ఇబ్బందులకు గురిచేసింది చంద్రబాబేనన్న విషయం అందరికీ తెలుసని మంత్రి చెప్పారు. ఆనాడు వంగవీటి రంగాను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పన్ని హత్య చేయించాడని గుర్తుచేశారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చి చిత్రహింసలకు గురిచేసింది బాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో కాపు యువకులపై కేసులు బనాయించి హింసించిన విషయాన్ని కాపు జాతి ఎన్నటికీ మరిచిపోదని స్పష్టం చేశారు. కాపు జాతిని అణగదొక్కిన చంద్రబాబు వెంట వెళ్తూ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న పవన్ కల్యాణ్ పేరు చెబితే కాపు జాతి ఛీకొట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కాపులపై బనాయించిన తప్పుడు కేసులను సీఎం జగన్ తొలగించారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీని, నేడు జనసేన పార్టీని అంతమొందించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మంత్రి తెలిపారు. ప్యాకేజీ పేరుతో పవన్ కల్యాణ్‌ను లోబరుచుకుని రాజకీయంగా ఎదగనివ్వకుండా అణగదొక్కేశాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసి కుట్రలు చేసినా గెలిచేది జగనే అని మంత్రి కొట్టు ధీమా వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులకు అన్ని విధాలుగా అండగా నిలిచారన్నారు.