టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతుంది. అమరావతి రాజధాని అనే విషయాన్ని టీడీపీ బ్యాచ్ మధ్యాంధ్రలో ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో దాని ఊసెత్తడం లేదు. అమరావతి బాగోతం ఆ ప్రాంతాల ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు డ్రామా ఆడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా టీడీపీ బ్యాచ్ ఇచ్చిన వాణిజ్య ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది.
మోదీ రాక అమరావతి రాజధాని కోసమని మధ్యాంధ్రప్రదేశ్‌లోని వార్తాప్రతికల్లో ప్రకటించగా, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర వికాసానికి అని ప్రకటించారు. దీన్ని బట్టే చంద్రబాబు బ్యాచ్ ఎటువంటి డ్రామాలు ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రాజధాని కూడా లేకుండా అయిందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారు. కానీ అసలు చంద్రబాబు చేస్తున్న కుట్రలేమిటో ఆయన అర్థం చేసుకున్నట్లు లేదు. ఒక వేళ అర్థం చేసుకున్నా టీడీపీతో జత కట్టారు కాబట్టి, వైఎస్ జగన్‌ను విమర్శించాలి కాబట్టి ఆ మాట అని ఉంటారు.
నిజానికి ఆంధ్ర రాష్ట్రం విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు శ్రీబాగ్ ఒడంబడికను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అప్పటి మద్రాసు రాష్ట్రం(ఇప్పటి తమిళనాడు రాష్ట్రం) నుంచి ఆంధ్ర విడిపోయిన సమయంలో రాయలసీమ, ఆంధ్ర పెద్దల మధ్య ఒక ఒడంబడిక జరిగింది. దాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. రాయలసీమ ప్రజలు ఆంధ్ర ప్రాంత నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలను నివృత్తి చేసి రాయలసీమ అభివృద్ధికి తగిన గ్యారంటీలను ఆ ఒడంబడిక ఖాయం చేసింది.
మద్రాసు నుంచి 1953లో విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో ఏర్పడింది. దాని ప్రకారమే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఒక కేంద్రం విశాఖపట్నంలోనూ, మరో కేంద్రం అనంతపురంలోనూ ఏర్పడాలి. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో పదేళ్లు లేదా అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం రాయలసీమ ప్రాంతానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నీటి వినియోగానికి సంబంధించిన భారీ పథకాలను రాయలసీమ జిల్లాల కోసం ప్రత్యేకించాలి. రాష్ట్ర రాజధాని, హైకోర్టులలో రాయలసీమ ప్రజలు దేన్ని కోరుకుంటే దాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.
శ్రీబాగ్ ఒడంబడికలోని మిగతా విషయాలను వదిలేస్తే రాజధాని, హైకోర్టు విషయాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒడంబడిక మేరకు కర్నూలు ఆంధ్ర రాష్ట్రం రాజధాని అయింది. అయితే, హైదరాబాద్(తెలంగాణ ప్రాంతం) రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ వెంటనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలింది. అప్పటి నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగింది.
తెలంగాణ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆంధ్ర రాష్ట్రం పునరుద్ధరణ జరిగిన తర్వాత రాజధాని సమస్య మళ్లీ ముందుకు వచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అధికారికంగా ప్రకటన వెలువడడానికి ముందే ఆ విషయం తెలిసిన టీడీపీ నాయకులు, చెప్పాలంటే ఒక సామాజికవర్గానికి చెందిన పెద్దలు పెద్దయెత్తున ఆ ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసమంటూ 33 వేల ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పంటలు పండే భూములను కూడా తీసేసుకుంది. ఈ విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఏ ప్రాంతంలోనైతే రాజధాని సురక్షితం కాదని ఆ కమిటీ చెప్పిందో ఆ ప్రాంతాన్నే ఆయన ఎంపిక చేసుకున్నారు.
అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు ఓ భ్రమను కల్పించారు. సింగపూర్ స్థాయిలో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గ్రాఫిక్స్ చూపించారు. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. అవి కూడా నాసిరకంగా ఉన్నాయి. వాన పడితే పైకప్పుల నుంచి నీళ్లు కారడం వంటి ఘటనలు కూడా జరిగాయి. దానికితోడు, ఉద్యోగులంతా ఉదయం పూట వచ్చి సాయంత్రానికి గుంటూరుకో, విజయవాడకో వెళ్లిపోయే పరిస్థితి. వారాంతంలో అయితే చాలా మంది హైదరాబాద్ బాట పడుతూ వస్తున్నారు
అది ఏ మాత్రం రాజధానికి అనువైన ప్రాంతం కాకపోవడం అటుంచి, దాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. అంతటి మహానగరం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలోనే 2019లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బహుశా, జగన్ మనసులో శ్రీబాగ్ ఒడంబడిక ఉండే ఉంటుంది. అలాగే శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు ఏమిటో ఆయనకు తెలుసు. దీంతో రాష్ట్రంలో అధికార వికేంద్రీరణకు పూనుకున్నారు.
మూడు రాజధానుల పేర దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారు. విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని, అమరావతి శాసనసభ రాజధానిగా కొనసాగించాలని, హైకోర్టును కర్నూలుకు తరలించాలని ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేసుకుని వుంటే అది ఇప్పటికి ఎంతో అభివృద్ధి అయి ఉండేది. రాజధాని దిగులు తీరేది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రీత్యా జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. అది అమలులోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన స్థాయికి చేరుకుంటాయి. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసినట్లు అవుతుంది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నట్లు అవుతుంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, తిరుపతి నగరాలుగా ఏర్పడ్డాయి. చంద్రబాబు మొత్తం 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతల్లోని ప్రధాన నగరాలను అభివృద్ధి చేయలేదు. అసలు పట్టించుకోలేదు. ఆయన మొత్తం అమరావతి చుట్టే తిరిగారు.
జగన్ నిర్ణయం చంద్రబాబు చేసిన పొరపాట్లను సరిచేయడానికి పనికి వస్తుంది. కానీ, కోర్టుల్లో కేసులు వేసి మూడు రాజధానుల నిర్ణయానికి గండికొడుతూ వస్తున్నారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది.