వినటానికి విచిత్రంగానే ఉన్నా రెండు పార్టీల మధ్య వ్యవహారాలు మొదటి నుండి ఇలాగే నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఆ జాబితాలో టీడీపీ తరపున 94 మంది, జనసేన తరపున ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించినప్పుడు జనసేన నుండి కేవలం ఐదుగురిని మాత్రమే ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. జనసేన పోటీ చేస్తున్నదే 24 సీట్లలో. అలాంటపుడు ఐదుగురిని ప్రకటించిన పవన్ మళ్ళీ ఇప్పటివరకు చప్పుడు చేయలేదు.
మిగిలిన అభ్యర్థులను ప్రకటించటంలో పవన్ ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయమై ఆరా తీసినప్పుడు ఒక విషయం బయటపడింది. అదేమిటంటే జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులపైన చంద్రబాబే సర్వేలు చేయిస్తున్నారట. జనసేన తరపున పోటీ చేయబోయే 24 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చేశారట. ఆ జాబితా ఆధారంగానే చంద్రబాబు తన సర్వే బృందాలతో గ్రౌండ్ లెవల్లో పీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. 24 మంది అభ్యర్థులపై సర్వే అంటే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ఉండే ఉంటుందనటంలో సందేహం లేదు.
సర్వే ప్రధానంగా అభ్యర్థుల నేపథ్యం, ఆర్థిక స్తోమత, ఎన్నికల్లో పోల్ మెనేజ్‌మెంట్ చేసుకునే సామర్ధ్యం, ప్రత్యర్థిని ఢీకొనేంత స్థాయి ఉందా లేదా? టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలు, జనాల్లో పరపతి, గెలుపు అవకాశాలు వంటి అంశాలపై సర్వేలు చేయిస్తున్నారట. ఇప్పటికే ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో నెల్లిమర్లలో పోటీ చేయబోతున్న లోకం మాధవిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలిసింది. మాధవి జనసేనలో కష్టపడి పనిచేస్తున్నా సామాజికవర్గ సమీకరణల్లో ఫిట్ కారని తేలిందట. అందుకనే మాధవి అభ్యర్థిత్వంపై జనసేనలోనే కాకుండా టీడీపీ నేతల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోందట. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ మీద కూడా నెగిటివ్ వచ్చిందని సమాచారం.
అభ్యర్థులకు సంబంధించి సర్వేలు చేయించుకుని డిసైడ్ చేసే యంత్రాంగం జనసేనకు లేదు కాబట్టి ఆ బాధ్యత కూడా చంద్రబాబే తీసుకున్నారట. ఎందుకంటే జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉంది కాబట్టి. అందుకనే జనసేన అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనలో ఆలస్యమవుతోందని సమాచారం. జనసేన అభ్యర్థులందరినీ చంద్రబాబే డిసైడ్ చేస్తారనే ప్రచారం నిజమయ్యేట్లుంది. జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో చూడాలి.