టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు లేదు. ప్రజలను హామీల ద్వారా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కడం ఆయన నీతి. పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. వాటి అమలు సాధ్యాసాధ్యాలను కూడా ఆయన ఆలోచించడం లేదు. అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే కదా సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించేది. ఆయన ఇచ్చిన కొన్ని ప్రధానమైన హామీలు ఇలా ఉన్నాయి.
– వలంటీర్లకు రూ.10 వేల చొప్పున వేతనం
– పింఛను రూ 4 వేలకు పెంపు.
– రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు రూ1500
– ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
– నిరుద్యోగులకు నెలకు రూ.3000
– తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు రూ.15000
– మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
– రైతులకు ఏటా రూ.20 వేలు
– మెగా డీఎస్సీ
– యువతకు 20 లక్షల ఉద్యోగాలు
వీటిలో చంద్రబాబు ఎన్ని హామీలను అమలు చేయగలరనేది ప్రశ్న. వలంటీర్లను దుర్భాషలాడిన చంద్రబాబు ఇప్పుడు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించడం వల్ల పేద ప్రజలంతా వ్యతిరేకమవుతారని భావించి ప్లేటు ఫిరాయించారు. వారికి నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. నెలకు రూ.50 వేలు సంపాదించుకునేలా వారికి శిక్షణ ఇప్పిస్తానని కూడా చెప్పారు. తమ విషయంలో చంద్రబాబు ఆడిన డ్రామా వలంటీర్లకు అర్థం కాదా, వారి ద్వారా ఫలితాలు అందుకుంటున్న ప్రజలకు అర్థం కాదా?
నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు గతంలో ఏం చేశారో తెలియదా? 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఆ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది మందికి వేయి రూపాయల చొప్పున చెల్లించి చేతులు దులిపేసుకున్నారు.
రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అరకొర చేసి దానికి ఎగనామం పెట్టారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ అమలు చేయడానికే సాధ్యం కాదు. మిగతా హామీలను కూడా అమలు చేస్తారనే నమ్మకం అసలు లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఎవరికైనా ప్రస్తుతం ఇస్తున్న హామీలను అమలు చేస్తారనే నమ్మకం ఏ మాత్రం కలగదు.