టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నిరుపేదలంటే ఏ మాత్రం గౌరవం లేదు. దళితులు, బహుజనులు, మైనారిటీలంటే ఆయనకు చిన్నచూపు. ఈ విషయం మరోసారి రుజువైంది. తాజాగా చంద్రబాబు నాయుడు కూలీలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాజాం సభలో ఆయన కూలీలపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్.. నీకు వచ్చేది కూలీ జనం’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కూలీలంటే ఆయనకు ఎంత చిన్నచూపు ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎటు వైపు ఉన్నారనేది కూడా ఆ వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది. ఆయన పెత్తందార్ల పక్కన ఉన్నారనే విషయం తెలిసిపోతూనే ఉంది.
గతంలో కూడా ఆయన నిరుపేదలను, దళితులను, బీసీలను అవమానించారు. టిప్పర్ డ్రైవర్‌కు జగన్ సీటిచ్చాడని ఎగతాళి చేసి తన ఫ్యూడల్ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులకు వైఎస్ జగన్ సింగనమల అసెంబ్లీ సీటు కేటాయించారు. దానిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వేలిముద్రగాడంటూ వీరాంజనేయులును అన్నారు. నిజానికి ఆయన ఎంఏ చదువుకున్నారు.
రావులపాలెం సభలో ఆయన వర్తకులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో వర్తకులు ఆయనపై భగ్గుమన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని గతంలో ఆయన దళితులను అవమానించారు. తోకలు కత్తిరిస్తానని నాయీ బ్రాహ్మణులను ఆయన బెదిరించారు.
చంద్రబాబులోని అగ్ర కుల దురహంకారం తరుచుగా బయటపడుతూనే ఉంది. తాజాగా కూలీలపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. పేద ప్రజలు జగన్‌కు అనుకూలంగా ఉండడం ఆయనకు మింగుడు పడడం లేదు. పేదల జీవితాలను మెరుగుపరచడానికి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో వారికి జగన్ పట్ల అభిమానం ఉంది. దాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు కూలీలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు.