వలంటీర్లకు వ్యతిరేకంగా గతంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగి వచ్చారు. మరో దిక్కులేక, వారిని వ్యతిరేకిస్తే ఎదురయ్యే ప్రమాదాన్ని గ్రహించి ఆయన దిగి వచ్చారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, ఎవరినీ ఉద్యోగాల్లోంచి తీసేయబోమని ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు. వలంటీర్ వ్యవస్థ ప్రాముఖ్యం ఏమిటో ఈనాటికి గానీ ఆయన గుర్తించినట్లు లేదు.
వలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తే ప్రజలు కూడా దూరమవుతారని ఆయనకు భయం పట్టుకున్నట్లుంది. వలంటీర్ల ద్వారా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. దానివల్ల వలంటీర్ వ్యవస్థపై ప్రజలకు సదభిప్రాయం ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారనే ఆందోళనకు ప్రజలు గురయ్యారు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా చంద్రబాబు గుర్తించారు. దాంతో వలంటీర్లను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.
పెనుకొండ సభలో ఆయన సోమవారం ప్రసంగిస్తూ.. వలంటీర్లను కొనసాగిస్తామని, ఈ విషయంలో మరో ఆలోచన లేదని ఆయన చెప్పారు. గతంలో వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, రౌడీలూ నేరస్థులు ఉన్నారని ఆయన విమర్శలు చేశారు. ఆయన మిత్రుడు పవన్ కల్యాణ్ అయితే మరీ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. ఏమైనా, చంద్రబాబును నమ్మేదెవరు? ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య కథ ఆయనది.