టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అరకు ‘రా కదలిరా’ సభకు ఆటోల్లో ప్రజలను తరలించారు. అయితే, ఆటో డ్రైవర్లకు కిరాయి ఎగ్గొట్టారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. టీడీపి నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఉప్ప, చికుమద్దుల, బాకూరు, ఆండిభ పంచాయతీల పరిధిలోని ఆటో డ్రైవర్లు వీధికెక్కారు.
గతన నెల 20వ తేదీన అరకులో టిడిపి ‘రా కదలిరా’ సభ జరిగింది. ఆ సభకు జనాలను తరలించడానికి ఒక్కో ఆటోకు రూ.2,500 చెల్లిస్తామని టిడీపి నేతలు ఒప్పందం చేసుకున్నారు. కొంత మందికి రూ.500 చొప్పున అడ్వాన్స్‌స ఇచ్చారని, మరికొంత మందికి ఏమీ ఇవ్వకుండా ఒకేసారి ఇస్తామని ఆటో డ్రైవర్లకు చెప్పి సభకు జనాలను తరలించడానికి వాడుకున్నారని ఆటో డ్రైవర్లు చెప్పారు. బాకురు, అండిభ పరిధిలో దాదాపు 60 ఆటోలను, ఉప్ప ప్రాంతం పరిధిలో 50 ఆటోలను వాడుకున్నారు. మొత్తం 110 ఆటోలను జనాలను తరలించడానికి వాడుకున్నట్లు చెప్పుతున్నారు.
డబ్బులు అడిగితే టీడిపి నాయకులు తప్పించుకుని తిరుగుతున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సభ రోజు సంత ఉందని, తాము సభకు వెళ్లకుండా అక్కడే సర్వీస్ చేసుకుంటే రూ.3 వేల దాకా సంపాదించుకుని ఉండేవాళ్లమని వారు అంటున్నారు. తమకు కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే టిడిపి నాయకులను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.