చంద్రబాబును చూస్తుంటే పాపం అనిపించింది. ఎందుకంటే నరేంద్ర మోదీని పొగత్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఒకపుడు ఇదే చంద్రబాబు ఇదే మోదీని నోటికొచ్చినట్లు తిట్టారు. మోదీని రాజకీయంగానో లేకపోతే విధానపరంగానో విమర్శించటం, ఆరోపణలు చేయటంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఎటాక్ చేశారు. మోడీని ఎటాక్ చేయటంతో ఆగకుండా తల్లి, భార్యను కూడా అవమానకరంగా మాట్లాడారు. అసెంబ్లీ, బహిరంగసభలు, మీడియా సమావేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇంతటో ఆగకుండా 2019 ఎన్నికల్లో కర్నాటక, బెంగాల్, ఢిల్లీకి కూడా వెళ్ళి మోదీ వ్యతిరేక ప్రచారం చేశారు.
తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. ఫలితాలు వచ్చిన దగ్గర నుండి మోదీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి చంద్రబాబు తాజాగా చిలకలూరిపేట ప్రజాగళంలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా మోడీని ఇంతగా ఎవరూ పొగడలేదేమో అనిపించేట్లుగా భజన చేయటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు భజన చూస్తే ఒళ్ళు మరచిపోయి, పూనకం వచ్చిన వాళ్ళు ఊగిపోయినట్లుగా ఊగిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే మూడు పార్టీల కూటమి నిర్వహించిన మొదటి బహిరంగసభ వాళ్ళు చెప్పుకున్నట్లుగా ఏమంతా సక్సెస్ కాలేదు.
చెప్పుకోవటానికి మూడు పార్టీలున్నా జనసమీకరణ బాధ్యతంతా టీడీపీ, జనసేన మీదే పడినట్లు అర్థమవుతోంది. అయితే వీళ్ళు ఎంతగా శ్రమించినా బహిరంగసభకు 4 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నా సాధ్యంకాలేదని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ తన స్పీచ్‌ను అర్థంకాని రీతిలో మొదలుపెట్టారు. ఎప్పుడు మాట్లాడినట్టే జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేశారు. తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా ఒకవైపు మోదీ భజన చేస్తునే మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రతిరోజు చేసే ఆరోపణలను మరోసారి చేశారంతే.
చివరగా మాట్లాడిన మోదీ.. చంద్రబాబు, పవన్ బ్రహ్మాండమని ఎక్కడా చెప్పలేదు. ఇదే సమయంలో జగన్‌ను పేరు పెట్టి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అవినీతిగా మారిపోయిందన్నారు. వైసీపీ, కాంగ్రెస్ ఒకే ఒరలో కత్తులని ఆరోపించారంతే. 400 పార్లమెంటు సీట్లను సాధించేందుకు ఎన్డీయేకి ఓట్లేయాలని మాత్రం విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్డీయేకి ఎందుకు ఓట్లేయాలో మాత్రం చెప్పలేదు. ఏపీకి ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరానికి నిధుల్లాంటి అంశాలను పొరబాటున కూడా ప్రస్తావించకుండానే సభను ముగించేశారు.