టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు, తద్వారా రాష్ట్రంలో హింసకు తెర తీయాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఆయన నెల్లూరు జిల్లా కోవూరులో అత్యంత దారుణమైన వ్యాఖ్య చేశారు. ‘రేపు నిన్ను చంపేస్తే ఏమవుతుంది?’ అంటూ చంద్రబాబు ఉచితానుచితాలు మరిచి వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ మీద ఉన్న ఈర్ష్యాద్వేషాలను ఆయన తన మాటల ద్వారా బయటపెట్టుకుంటున్నారు. ఏ ముఖ్యమంత్రిని కూడా అనకూడని మాటలు అంటున్నారు. జగన్ను సైకోగా అభివర్ణిస్తున్నారు. ‘జగన్ను రాయితో కొట్టండి, ఏది దొరికితే దానితో కొట్టండి’ అంటూ గతంలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల కారణంగానే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దానివల్లనే ఇటీవల విజయవాడలో జగన్పై దాడి జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో జగన్ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్న చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్ తన మేనిఫెస్టోను విడుదల చేసి, తాను ఏం చేగలనో, ఏది చేయలేనో స్పష్టంగా చెప్పారు. జగన్ హామీలను ప్రజలు నమ్మే వాతావరణం ఉంది. గత ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పథకాలు ఆయన విశ్వసనీయతను పెంచాయి.
జగన్కు ఉన్న విశ్వసనీయత చంద్రబాబుకు లేదు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పాపాన పోలేదు. ఆయన మొత్తం అమరావతి చుట్టే తిరిగారు. దాన్నీ అంగుళం కదలించలేకపోయారు. భూదందాలకు తెర తీసి తన, తనవారి ప్రయోజనాలనే చంద్రబాబు చూసుకున్నారు. ఈ విషయం ఆంధ్ర ప్రజలకు స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది.
బహుశా, రాష్ట్రంలో హింస చెలరేగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉండాలి. ఆయన మిత్రుడు పవన్ కల్యాణ్ కూడా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఇరువురు నాయకులు కూడా ఒకరిని మించి ఒకరు జగన్ మీద విషం కక్కుతున్నారు. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామనే విషయాలను స్పష్టంగా చెప్పలేని దురవస్థలో వారు ఉన్నారు.