ప్రస్తుత తరం ‘రాజాధిరాజు’ సినిమాను చూసి ఉండరు. ఈ సినిమా 1980 దశకంలో వచ్చింది. ఆ సినిమాను చూడకపోతే కచ్చితంగా చూడాల్సిందే. అందులో నూతన్ ప్రసాద్ పోషించిన సైతాన్ పాత్ర సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తుందో కళ్లకు కట్టినట్లు దర్శకుడు బాపు చూపించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చూస్తుంటే సైతాన్ పాత్రనే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తానని ఆయన ఇచ్చిన హామీ గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా ఆ పాత్ర గుర్తుకు వస్తుంది.
పేద కుటుంబాలను మద్యానికి దూరం చేయడానికి అవసరమైన నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, మద్యం నియంత్రణ కారణంగా పేదల కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగాయి. జగన్ ప్రజలకు వైద్యాన్ని, విద్యను అందుబాటులోకి తెచ్చి వారికి మెరుగైన జీవితాలను అందించడానికి చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు మాత్రం మద్యం ఏరులై పారే చర్యలు తీసుకుంటానని చెప్పుతున్నారు.
మద్యం ధరలతో పాటు అన్ని సరుకుల ధరలు పెరిగాయని, తాను మద్యం గురించి మాట్లాడినప్పుడు యువత గంతులు వేస్తోందని, మద్యం ధరలు తగ్గాలని యువత కోరుకుంటోందని, లిక్కర్ బాటిల్ ధరను జగన్ రూ.60 నుంచి రూ.200కు పెంచారని, తనకు అధికారంలోకి వస్తే లిక్కర్ ధరలు తగ్గిస్తానని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబుకు ప్రజల ఆరోగ్యం పట్ల, పిల్లల చదవుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేదని అర్థమవుతోంది. సమాజంపై మద్యం ప్రభావాన్ని తగ్గించే మాటలనే రాజకీయ నాయకులు సాధారణంగా చెప్పుతుంటారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇంట్లో మగవాళ్లు మద్యం సేవించడాన్ని, అదీ మోతాదును మించి తాగడాన్ని ఏ మహిళ కూడా సహించదు. మద్యం వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా దిగజారుస్తుంది. మహిళా ఓటర్లు చంద్రబాబుకు వ్యతిరేకమవుతారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు కనీసమైన ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు మాట్లాడారు.