వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు, పడవల్లో కూడా పాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ పంపిణీ జరుగుతోంది. మరోవైపు తమకు అసలు ఆహార పదార్థాలు అందలేదని, ఆకలితో అలమటించిపోతున్నామని కొంతమంది చెబుతున్నారు. ఈ గ్యాప్ ఎక్కడొచ్చింది..? సహాయక శిబిరాలనుంచి తరలి వెళ్తున్న ఆహారం ఏమైనట్టు..? బాధితులను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా..?
టీడీపీ అనుకూల మీడియా వింతైన కథనాలను ప్రచారంలోకి తెచ్చింది. వైసీపీ అనుకూల అధికారులు కొంతమంది వరద ప్రభావిత ప్రాంతాల్లో విధుల్లో ఉండి, ఉద్దేశపూర్వకంగా సహాయక చర్యల్ని ఆటంకపరుస్తున్నారని ఆ కథనాల సారాంశం. అలాంటివారిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని అన్నారట. జగన్ కోసమే వారు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, అందుకే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ అనుకూల మీడియా పేర్లతో సహా వివరాలిచ్చింది.
అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరిగిందని సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి వాస్తవమే. అయితే పంపిణీ ఆలస్యం వెనక రాజకీయ కోణాన్ని వెదకడం మాత్రం విశేషం. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి ఆరోపించారు. క్షేత్ర స్థాయి పర్యటనలో తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానంటూ ఆయన సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. అధికారుల లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో అత్యవసర డ్యూటీలకు వచ్చిన పోలీస్ అధికారుల పేర్లు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయట. ఆ మంత్రి ఇచ్చిన సమాచారంతోనే సీఎం చంద్రబాబు అధికారులపై చిర్రుబుర్రులాడారని సమాచారం.
మరోవైపు ప్రైవేట్ బోట్లతో కొత్త వ్యాపారం మొదలైంది. సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని తరలించేందుకు ఒక్కో మనిషికి 1500 రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బోట్లను పంపించినా, కొన్నిచోట్ల ప్రైవేట్ బోట్లతో వ్యాపారం జరుగుతోందని అంటున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. వరద సహాయక చర్యల్లో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.