టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే విద్యుత్తు చార్జీల పెంపునకు నిర్ణయం జరిగింది. విద్యుత్తు చార్జీల టారిఫ్ ప్రతిపాదనలను ఏటా ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు సమర్పిస్తాయి. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా కొత్త టారిఫ్ ప్రకటిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడడానికి నెల రోజుల ముందే టారిఫ్ అమలులోకి వచ్చింది. ఇటువంటి స్థితిలో చార్జీలను కొత్త ప్రభుత్వం నిర్ణయించే అవకాశం లేదు.
చంద్రబాబు హయాంలో పెంచిన చార్జీలనే ఇప్పటికీ వసూలు చేస్తున్నారు తప్ప కొత్తగా పెంచింది ఏమీ లేదు. అప్పటి చార్జీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2021 – 22లో వినియోగించిన విద్యుత్‌కు వాస్తవ, ఆమోదిత విద్యుత్ కొనుగోలు ఖర్చులోని వ్యత్యాసాన్ని మాత్రమే ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ఈ వసూలు వల్ల ప్రజలపై భారం పడదు. ప్రతి యూనిట్‌కు కేవలం రూ.0.6455 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదు. దానికితోడు సబ్సిడీ చెల్లించే కెటగిరీలో ఉన్న వినియోగదారులకు ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.
గృహ వినియోగానికి సంబంధించిన కేటగిరీలో అంతకు ముందు విధిస్తున్న కనీస వినియోగ చార్జీలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గృహ వినియోగం కేటగిరీలో స్థిరమైన చార్జీలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కర్ణాటకలో కిలోవాట్‌కు రూ.110 వసూలు చేస్తున్నారు. మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్‌కు రూ.110, త్రీ ఫేజ్‌కు రూ.385 వసూలు చేస్తున్నారు. కేరళలో సింగిల్ ఫేజ్‌కు రూ.40 నుంచి రూ.260 వరకు, త్రీఫేజ్‌కు రూ.100 నుంచి రూ.200 వరకు విధిస్తున్నారు.
2021 – 22 ఆర్థిక సంవత్సరానికి ముందు ఒక్కో సర్వీసుకు నెలవారీ కనీస చార్జీల మొత్తం రూ.25గా ఉండేది. 2021 ఏప్రిల్‌లో ఆ కనీస చార్జీని ఒక్కో కిలోవాట్‌కు రూ.10గా నిర్ణయిస్తూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిర చార్జీలను డిస్కంకు విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థకు అయ్యే వ్యయం, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన స్థిర వ్యయంలో కొంత భాగాన్ని రికవరీ చేసుకోవడం కోసం విధిస్తున్నారు.
దీన్ని గృహేతర కేటగిరీల్లో ముందు నుంచే వసూలు చేస్తున్నారు. నిజానికి దాదాపు 67 శాతం సర్వీసులు ఒక కిలోవాట్ అంతకన్నా తక్కువ లోడ్ పరిధిలో ఉంటాయి. అందువల్ల ఒక్కో సర్వీసుపైన విద్యుత్ సంస్థలు దాదాపు రూ.15 నష్టాన్ని భరిస్తున్నాయి. ఇందులో ప్రజలపై భారం వేసేది ఏమీ లేదు.
2023-24కు సంబంధించి విద్యుత్ కొనుగోలు ట్రూ – అప్ (విద్యుత్ కొనుగోలు వ్యయం, సర్దుబాటు)కు ఏపీఈఆర్సీ రెగ్యులేషన్ – 2 ప్రకారం ఏప్రిల్ నెల వినియోగానికి ఎఫ్‌ఏపీసీఏ మొత్తాన్ని జూన్‌లో వసూలు చేయాలి. యూనిట్‌కు గరిష్టంగా 40 పైసల వరకు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో వ్యవసాయ, ఇతర సబ్సిడీ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది.
2014 – 15 నుంచి 2018-19 వరకు ఆమోదించిన దానికి వాస్తవ పంపిణీ ఖర్చులో ఏర్పడిన వ్యత్యాసం రూపేణా రూ.2,910.74 కోట్లు ట్రూప్ – అప్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల మేరకు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 7 పైసల చొప్పున అనుమతించినదానిలో సగం మాత్రమే వసూలు చేశాయి.
వాస్తవానికి ఈ చార్జీలను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సర్దుబాటు చేయాల్సి ఉంది. 2014 – 15 నుంచి 2018 – 19 వరకు ఐదేళ్లకు టీడీపీ ప్రభుత్వం రూ.17,487 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. అయితే, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లు చెల్లించలేదు. అదే ట్రూ-అప్‌గా ప్రజలపై పడింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019-20 నుంచి 2023-24 వరకు నాలుగేళ్లలో రూ.20,375 కోట్లు మంజూరు చేసి, రూ.20,479 కోట్లు చెల్లించింది.