ఏపీలో ప్రజాగళం పేరుతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే ప్రధాని మోదీ లాంటి వ్యక్తి హాజరైన సభకు చేసిన ఏర్పాట్లు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రధానంగా సభ నిర్వహణపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన మైక్ సిస్టమ్ అధ్వానంగా ఉంది. ప్రధానమైన వ్యక్తులు మాట్లాడుతున్న సమయంలో పదే పదే మైక్ కట్ కావడం అక్కడున్న వారికి చిరాకు తెప్పించింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న టైంలో రెండు, మూడు సార్లు ఆయన ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. ఇందులో ఏకంగా 8 నిమిషాల పాటు ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని నిలిపేసి మౌనంగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో ప్రధాని మోదీ కూడా కొంత అసంతృప్తికి గురయ్యారు.
పొత్తు ప్రకటన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ, అందులోనూ ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ లాంటి నేతలు హాజరుకావడం.. ఇలాంటి కీలకమైన సభను నిర్వహిస్తున్నప్పుడు ఏర్పాట్లు కూడా అంతే పకడ్బందీగా చేయాలి. మైక్ అంతరాయం ఉద్దేశపూర్వకంగా చేసింది కానప్పటికీ.. ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం పక్కకు పోయి.. మైక్ అంతరాయం విషయమే సభకు హైలెట్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ దీని మీదే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మంత్రి అంబటి రాంబాబు కూడా సెటైర్లు వేశారు. మైక్ ఫెయిల్.. మీటింగ్ ఫెయిల్.. టోటల్‌గా ముగ్గురూ ఫెయిల్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.