ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసీపీకి ఒకేరోజు రెండు గుడ్‌న్యూస్‌లు. జూన్ 26 నుంచి నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్టు అయిన జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్ వద్ద రిగ్గింగ్ జరుగుతుందని తెలుసుకొని, అక్కడికి చేరుకున్న పిన్నెల్లి, కొందరు టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. రిగ్గింగ్‌కు పాల్పడడం ఏంటని ఆరోపిస్తూ ఈవీఎంను ధ్వంసం చేశారు. అంతేకాకుండా కారంపూడి ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి తరఫున వాదనలు విన్న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
అదే విధంగా గృహ నిర్మాణ శాఖ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 13న అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ను అరెస్టు చేశారు. జోగి రాజీవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజీవ్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జోగి రాజీవ్‌తో పాటు, సర్వేయర్ రమేష్‌కు బెయిల్ మంజూరు చేసింది.