పొత్తులో లేనప్పుడు చంద్రబాబు గురించి పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. కూటమి కట్టి తాజా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రం సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో మోసేస్తున్నారు. ఆయన వీరుడు, శూరుడు, ధీరుడు, విజనరీ అంటూ పొగిడేస్తున్నారు. ఆమధ్య మైసూరావారి పల్లె గ్రామసభలో కూడా చంద్రబాబు తనకి ఆదర్శం అని అన్నారు. తాజాగా ఏపీ వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరుని మెచ్చుకుంటూ పవన్ ఓ ట్వీట్ వేశారు.
https://x.com/PawanKalyan/status/1831580858685280763
“మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ.. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఓవైపు, మరోవైపు ప్రకృతి వైపరీత్యం.. వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, RWS శాఖలు యుద్ద ప్రాతిపదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ వేశారు డిప్యూటీ సీఎం పవన్.
ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ లో చంద్రబాబు ప్రయాణం, జేసీబీలో ఆయన వరద ప్రాంతాల సందర్శన, కాలి నడకన మోకాలి లోతు నీళ్లలో బాధితుల్ని పరామర్శించడం.. ఇలా మీడియాలో చాలా విషయాలు హైలైట్ అయ్యాయి. మీడియాలో ఎలివేషన్లు సరిపోవనుకున్నారో ఏమో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం పనితీరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ట్వీట్ వేయడం విశేషం. ఈ ఎలివేషన్లపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇలా హైలైట్ కావడం కోసమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందుకే కలెక్టరేట్ లో మకాం వేశారని, నిద్ర పట్టక అర్థరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని కూడా ప్రచారం చేసుకుంటున్నారని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.