కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని ‘రాంపుర’లో విజయనగర సామ్రాజ్య కాలంనాటి చారిత్రక ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. రాంపుర చారిత్రక ప్రాభవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. ‘రాంపుర’ గ్రామానికి చెందిన దేవత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు.. ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి డాక్టర్ ఈమని శివానాగిరెడ్డి అక్కడకు వెళ్లారు. చారిత్రక ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడి పురాతన దేవాలయాలను కాపాడుతున్న కృష్ణ ప్రసాద్.. ఆ వారసత్వ ఆనవాళ్ల గురించి వారికి వివరించారు.
కావేరీ తీరంలోనే సుప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం(శ్రీరంగపట్నం) ఉంది. ఆ ఆలయానికి సమీపంలోనే ‘రాంపుర’ గ్రామం ఉంది. పచ్చటి పొలాల మధ్య, సుందర కావేరి నదీ తీరంలో, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా ‘రాంపుర’ కనపడుతుంది. ఈ గ్రామంలో క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన మూడు వీరగల్లులు, ఒక సతికల్లు, 9 అడుగుల ఎత్తున్న వీరాంజనేయ, బాలాంజనేయ విగ్రహాలు, కావేరీ నదిలో బండరాళ్లపై చెక్కిన సిద్ధి వినాయక శిల్పం, శివలింగం, ఎదురుగా ప్రతిష్టించిన నంది విగ్రహం ఉన్నాయి. విజయనగర కాలంలో ‘రాంపుర’ గ్రామం ప్రముఖ స్థావరంగా వెలుగొందిందని ఈ ఆనవాళ్లు తెలియజేస్తున్నాయని అన్నారు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి.
ఆలయ నిర్మాణం కోసం శిల్పాలు చెక్కడానికి కావలసిన రాతిని ఇక్కడి క్వారీల నుంచి తీశారు. ఈ క్వారీలు కావేరి నదిలో, నది ఒడ్డున ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. అంతే కాదు.. ఆ రాతిని విడగొట్టడానికి గూటాలు దింపటానికి చెక్కిన ఆనవాళ్లను కూడా నది ఒడ్డిన శివనాగిరెడ్డి గుర్తించారు. రామాయణ కాలపు గౌతమ మహర్షి నివాస స్థావరం, స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే.. శ్రీరంగపట్టణానికి వచ్చే పర్యాటకులను రాంపుర గ్రామానికి రప్పించవచ్చని ఆయన అన్నారు. ఇక్కడ ఇప్పటికీ చెక్కుచెదరని వందేళ్లనాటి ఇళ్లు కూడా ఉన్నాయి. వాటికి కొద్దిపాటి మరమత్తులు చేసి, ఆతిథ్య రంగంలో స్థానికులకు శిక్షణ ఇచ్చి, పెయిగ్ గెస్ట్ ఎకామిడేషన్ సౌకర్యం కల్పిస్తే.. రాంపుర గ్రామాన్ని వారసత్వ, తీర్థయాత్ర, గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్ర అన్నారు.