ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి టీడీపీ ప్రచారకర్తగా మారారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదని తన నోటి వెంట అమూల్యమైన మాటలను వదిలిపెట్టారు. నగదు పంచడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన గాలి కబుర్లు చెప్పుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాష్ట్ర ప్రగతికి చేసిందేమీ లేదని అంటున్నారు. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంతటి గుణాత్మకమైన మార్పు వచ్చిందో ఆయన గమనించారా? లేదు. పేద పిల్లల చదువుల కోసం జగన్ అమలు చేస్తున్న పథకాలను గమనించారా? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మారిన తీరు చూశారా? రాష్ట్రంలో ఓడరేవులు రూపుదిద్దుకుంటున్న తీరు ఆయన కళ్లకు కనిపించలేదు. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రగతి కాదని ఆయన భావిస్తున్నారు. ఇంత కన్నా భావదారిద్య్రం మరోటి ఉండదు.
ఉద్యోగాల కల్పనపై కూడా ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6.2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలు 40 వేలు కూడా దాటలేదు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అయ్యాయో కూడా ప్రశాంత్ కిశోర్ అనే ఉత్తరాది మేధావి పరిగణనలోకి తీసుకోలేదు.
జగన్ ఓడిపోతాడని చెప్పడానికి ముందు ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుకున్న విశ్వసనీయత ఏపాటిదో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పోలవరం, అమరావతి చుట్టు మాత్రమే తిరిగారు. రెండింటిని కూడా పూర్తి చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం, తనవారికి డబ్బులు సంపాదించి పెట్టడం కోసం వాడుకున్నారు. అమరావతిని తన సామాజిక వర్గం ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ దందాగా మార్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. అందువల్ల చంద్రబాబు ఓటమి పాలు కాక తప్పదు. చంద్రబాబు గురించి లోతుగా అధ్యయనం చేసి, జగన్ ప్రజలకు చేసిన మేలు ఏమిటో క్షుణ్ణంగా పరిశీలించి ఉంటే ప్రశాంత్ కిశోర్‌కు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అర్థమై ఉండేది.