బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరుల దాడిని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చిన హరీష్ రావు.. కొండాపూర్‌లోని నివాసంలో కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. పక్కా ప్రణాళికతోనే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందన్నారు. ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గతంలో తన ఆఫీసుపై దాడి చేశారని గుర్తుచేశారు. ఇటీవల ఖమ్మం వరద బాధితుల పరామర్శకు వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని చెప్పుకొచ్చారు. తమ సహనాన్ని అసమర్థతగా భావించొద్దని హెచ్చరించారు. దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. `మీరు ఒకటి చేస్తే మేం రెండు చేస్తాం` అన్నారు హరీష్ రావు. రేవంత్ బాధ్యత లేని మనిషంటూ విమర్శించారు. కాంగ్రెస్ పాలనను దేశం మొత్తం గమనిస్తోందన్నారు.
ఇక అంతకుముందు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర హైటెన్షన్ నెలకొంది. అరికెపూడి గాంధీ భారీ కాన్వాయ్‌తో కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకుని హల్‌చల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులతోనూ గాంధీ అనుచరులు వాగ్వాదానికి దిగారు. కౌశిక్ రెడ్డి నివాసంపై రాళ్లు, టమాటలు, కోడిగుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు గాంధీ. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను కౌశిక్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇక కౌశిక్ రెడ్డి సైతం రేపు అరికెపూడి నివాసానికి వెళ్తానని, తన సత్తా ఏంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
దాడి అనంతరం ఫిర్యాదు చేసేందుకు సైబరాబాద్ సీపీ ఆఫీసుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆఫీసు మెట్లపై ఆందోళనకు దిగారు నేతలు. అనంతరం హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు నేతలు లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.