విజయవాడ ప్రజల కష్టాలు చూసి తన గుండె తరుక్కుపోతోందంటూ మాజీ మంత్రి రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఓ దశలో ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యారు. వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతం అని అన్నారామె. బాధితుల మాటలు విటుంటే నాలుగురోజులుగా వారు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతోందన్నారు రోజా. పాలు, నీళ్లు అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారని, వరదల్లో కొట్టుకుపోయినవారి ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
https://x.com/sakshitvdigital/status/1830942278564659430
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..
సీఎం చంద్రబాబు ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా వారు సకాలంలో స్పందించలేకపోయారని విమర్శించారు రోజా. ఈ విపత్తు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా.. విజయవాడ నగరంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవారని ముంపుబారిన పడి ఉండేవారు కాదన్నారామె. కేవలం ప్రభుత్వ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్లే నాలుగు రోజులుగా విజయవాడ వాసులు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు రోజా.
ప్రజలు కష్టాలు పడుతుంటే మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారని విమర్శించారు రోజా. హాలిడేస్ ని ఎంజాయ్ చేయడంపై పెట్టిన శ్రద్ధ వారికి రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. విపత్తుని నివారించడంలోనే కాదు, సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారామె. ఆగస్ట్ 28 నాడే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, కానీ సీఎం సహా ఒక్క మంత్రి కూడా సమీక్షలు జరపలేదని, తీరా కష్టం వచ్చాక అర్థరాత్రి సమీక్షలంటూ హడావిడి చేశారని మండిపడ్డారు రోజా.
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఉండేవని వాటిని సరిగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు రోజా. జగన్ పై కక్షతో ఆయా వ్యవస్థలను నీరుగార్చడం సరికాదన్నారు. జగన్ వల్లే విజయవాడ ఓ వైపు మునిగిపోకుండా ఉందని, వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ కట్టడం వల్లే ప్రజలు సేఫ్ గా ఉన్నారని చెప్పారు రోజా.