వరద నష్టపరిహారం విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉంది. నష్టనివారణ చర్యలు, పునరావాసం విషయంలో ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పరిహారంతో బాధితులకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. అధికారికంగా సాయం లెక్కలు బయటకు రాకపోయినా టీడీపీ అనుకూల మీడియాలో ముందే లీకులిస్తున్నారు. అంటే అనధికారికంగా ఆ లెక్కలు అధికారికమే అనుకోవాలి.
ఎవరికెంత..?
నీట మునిగిన ఇంటికి రూ.25వేలు
ఇంట్లోకి నీరు చేరితే రూ.10వేలు
వరద వల్ల పాడైపోయిన బైక్ ల రిపేర్ కి రూ.3వేలు
ఆటో, ట్యాక్సీలు పాడైపోతే రూ.10వేలు ఆర్థిక సాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గతంలో నెల్లూరు జిల్లా వరదల సమయంలో తక్షణ సాయంగా వైసీపీ ప్రభుత్వం వెయ్యి, రెండు వేల రూపాయలు బాధితులకు అందజేసింది. వాహనాల మరమ్మతులకు అప్పట్లో ప్రభుత్వం సాయం చేయలేదు. విజయవాడ విలయం పెద్దది కాబట్టి ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించే అవకాశముంది. వాహనాల మరమ్మతులకు కూడా ఈసారి ప్రభుత్వమే సాయం చేయాలనుకోవడం విశేషం. పరిహారం పంపిణీ సక్రమంగా జరిగితేనే అసలైన బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ కూడా రాజకీయ జోక్యం ఎక్కువైతే మాత్రం పరిహారం పరిహాసంగా మారే ప్రమాదం ఉంది.