విజయవాడ క్రమక్రమంగా కోలుకుంటోంది, భారీ వర్షాలు ఇప్పుడు ఉత్తరాంధ్రను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదనీటితో వాగులు, వంకలు ఉప్పొంగాయి. అల్లూరి జిల్లాలో వర్షాలకు కొండచరియలు విరిగి పడి ఇల్లు కూలిపోగా ఒకరు మరణించారు, ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇళ్లు కూలిపోగా ప్రాణ నష్టం తప్పింది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జన జీవనం స్తంభించింది. రోడ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. అల్లూరి జిల్లాలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో పిల్లిగడ్డ అంతర్ రాష్ట్ర వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సీలేరు-దుప్పిలవాడ మధ్య రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. కొన్నిచోట్ల వంతెనలపైకి నీరు చేరగా, మరికొన్ని చోట్ల ఏకంగా వంతెనలే కొట్టుకుపోయాయి.
విజయవాడ విపత్తులో కాలనీలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదనీటిలో కొట్టుకుపోయి మరణాలు సంభవించాయి. ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాలతో రోడ్లు, కల్వర్ట్ లు కొట్టుకుపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా మారాయి. జలాశయాలనుంచి నీటిని కిందకు వదలడంతో లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు అధికారులు. తాండవ, కోనాం, తాటిపూడి, మడ్డువలస, మేఘాద్రి జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో భారీగా వరద చేరుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.