ఏపీలో వర్షాలు, వరదలతోపాటు వరద రాజకీయం కూడా హైలైట్ గా మారింది. టీడీపీ, వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాల్లో బురదజల్లుకోవడం ఓ రేంజ్ లో జరిగింది. వరదల్లో విజయవాడ, గుంటూరు వాసులు నష్టపోగా, నాయకులు క్రెడిట్ కొట్టేయడానికి పోటీ పడుతున్నారు. అర్థరాత్రి 2 గంటలకు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయగా.. వైసీపీ మీడియాలో జగనన్న రిటైనింగ్ వాల్ విజయవాడను కాపాడిందని వార్తలొస్తున్నాయి. గొడుగులు లేకుండా బయటకొచ్చి వర్షంలో తడుస్తూ చోటా మోటా నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న ఫొటోలు, వీడియోలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఇంతకీ ఈ వరదరాజకీయంలో విజేత ఎవరు..?
https://x.com/trollycp/status/1830321948766957654
ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే విజయవాడ నగరం ముంపు బారిన పడిందని విమర్శించారు వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్. వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తివేయడంవల్లే విజయవాడ మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జలదిగ్బంధంలో చిక్కుకుని సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైసీపీ కార్యకర్తలే ముందున్నారని చెప్పారు.
https://www.youtube.com/live/vmJmKO5Sw_Q?si=cfenCgje8q-h89pt
ఇక జగనన్న రిటైనింగ్ వాల్ అంటూ సాక్షి మీడియాలో జరుగుతున్న హడావిడి అంతా ఇంతా కాదు. జగనన్న వల్లే విజయవాడలోని ఓ ప్రాంతం సేఫ్ గా ఉందని, అదంతా జగనన్న పుణ్యమేనని కొంతమంది స్థానికుల ముందు మైక్ లు పెట్టి అనిపిస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ విషయంలో టీడీపీ కూడా క్రెడిట్ కోసం ట్రై చేస్తోంది. అది టీడీపీ హయాంలో కట్టిందని, దానికి జగన్ రంగులు మాత్రమే వేయించారని టీడీపీ నేతలు అంటున్నారు.
https://x.com/JaganannaCNCTS/status/1830438852521341312
ఇక సీఎం చంద్రబాబు అర్థరాత్రి ప్రెస్ మీట్లు పెట్టడాన్ని టీడీపీ అనుకూల మీడియా బాగా హైలైట్ చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బోట్ లో చంద్రబాబు పరామర్శలకు వెళ్లడాన్ని, రాత్రంతా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో మకాం వేసి సమీక్షలు నిర్వహించడాన్ని, అర్థరాత్రి జరిగిన ప్రెస్ మీట్లను టీడీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిళ్లు వైరల్ చేశాయి.
https://x.com/JaiTDP/status/1830322765179793823
కొండచరియలు విరిగిపడిన ఘటనతో సహా.. ఏపీలో తాజా వర్షాలు, వరదలకు మొత్తం 15మంది చనిపోయారని అధికారిక సమాచారం. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు ప్రారంభించినా కొన్నిచోట్ల బాధితులు నిత్యావసరాలు లేక ఆకలితో అలమటిస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి వర్షపాతం లేదని, ఇప్పుడు చేసేదేమీ లేదని సరిపెట్టుకోలేం. భవిష్యత్తులో ఇంతకంటె పెద్ద వరదలు వచ్చినా నష్టాన్ని పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడమే తక్షణ కర్తవ్యం.