ఎన్నికల వేళ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సేవలో మాజీ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరించిపోతున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేర ఓ సంస్థను ఏర్పాటు చేసి చంద్రబాబుకు అనుకూలమైన కొంత మందితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిట్టిపోయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి.రమేష్‌ను రంగంలోకి దించారు. జగన్‌తో ఆయనకు ఉన్న విభేదాలు తెలిసినవే. పీవీ రమేష్ తనదైన శైలిలో ఊకదంపుడు వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు పంచుతున్నారని ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ మాదిరిగానే పీవీ రమేష్ కూడా మీడియా సమావేశంలో అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో కొత్తదనమేమీ లేదు. నిర్దిష్టంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెట్టడంలో ప్రశాంత్ కిశోర్, జయప్రకాశ్ నారాయణ మాత్రమే కాకుండా పీవీ రమేష్ కూడా విఫలమయ్యారు. అంటే, గాలి వ్యాఖ్యలు చేస్తూ జగన్ ప్రభుత్వం అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదనేది ఆయనగారి విలువైన మాట.
జగన్ సంక్షేమ పథకాలను అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారనేది ఆయన మనసు పెట్టి చూస్తే అర్థమయ్యేది. జగన్‌ను విమర్శంచాలి కాబట్టి విమర్శంచడమే తప్ప ఆయన మాటల్లో పసలేదు. రాష్ట్రానికి జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు, ఐటీ రంగం విస్తరణ, ఓడరేవుల అభివృద్ధి వంటి వాటిని ఆయన కావాలనే పట్టించుకోలేదు. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు పేద కుటుంబాల భవిష్యత్తును మార్చబోతున్నాయనే విషయాన్ని ఆయన విస్మరించారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో కన్నా చాలా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతన్నాయి. కావాలంటే ఆయన బేరీజు వేసుకోవచ్చు
‘‘నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా… కేసులు పెట్టేస్తాం… జైలులో వేసేస్తాం.. భూముల్ని లాక్కుంటాం. గనులను, పరిశ్రమలను మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు.. అది బందిపోట్లు చేసే పని.. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్దంగా, చట్టబద్దంగా పాలించాలి.’’ అంటూ ఇంకా ఏవేవో గాలి కబుర్లు చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు చేస్తున్న అనిర్దిష్టమైన ఆరోపణలనే పీవీ రమేష్ చేశారు. అంతకన్నా ఆయన మేధావిత్వాన్ని ఏమీ ప్రదర్శించలేదు. కేవలం మేధావి పేరు మీద ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటే అది పొరపాటే.
ప్రభుత్వాలే కాదు, మేధావివర్గం కూడా బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాల్సి ఉంటుంది. అయినా ఎన్నికల సమయంలోనే పీవీ రమేష్ కు ఇవన్నీ గుర్తుకు వచ్చినట్లు ఉంది. ప్రజల మేలు కోరేవారైతే నిరంతరం తాము అనుకున్న విషయాలను, ప్రభుత్వం చేస్తున్న తప్పులను చర్చకు పెట్టాలి. చంద్రబాబు తెర మీదికి వచ్చారు కాబట్టి ఆయన మరో రకంగా మాట్లాడే అవకాశం లేదు.