సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలకు ఇస్తామన్న ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి పంపిణీ చేస్తామంటోంది. కేబినెట్ మీటింగ్ లో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మహాశక్తి పథకం కింద పేదలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారాయన. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఈ హామీని దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు.
ఏపీలో వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 350 కోట్లు వచ్చాయని చెప్పారు సీఎం చంద్రబాబు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని పిలుపునిచ్చారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇవ్వాలనుకున్నామని, రికార్డు స్థాయిలో దాన్ని అమలు చేశామన్నారు. ఇక కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు చంద్రబాబు.
ఎన్డీఏ శాసన సభాపక్షసమావేశంలో ఎమ్మెల్యేలకు కూడా పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. కోట్లాది మంది కూటమిపై ఆశలు పెట్టుకున్నారని, ప్రతి అడుగు ఆలోచించి వేయాలని సూచించారు. తప్పులు చేయొద్దని, కక్ష సాధింపులకు పాల్పడొద్దని హెచ్చరించారు. ఎన్నికల ముందు మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం అద్భుతం అని, ఈ వంద రోజుల్లో కూడా అదే సమన్వయంతో పని చేశామని అన్నారు. ఇకపై కూడా దీన్నే కొనసాగించాలని చెప్పారాయన. పవన్ కల్యాణ్ శాఖల వద్దే ఎక్కువగా నిధులు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు.. ధాన్యం కొనుగోళ్లు చేస్తే 48 గంటల్లో డబ్బులు ఇస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశాన్ని రచ్చ చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ప్రైవేటుకు అప్పజెప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు తప్పిపోయాయని, వారికి కౌలుని క్రమం తప్పకుండా అందిస్తామన్నారు చంద్రబాబు.