ఇటీవల భారీ వర్షాలు వరదలకు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. మున్నేరు వాగు పొంగి పొర్లడంతో చాలా చోట్ల రాకపోకలు స్తంభించాయి. ఇళ్లు నీటమునిగాయి. ఖమ్మం పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆస్తి నష్టం, పంట నష్టం అంచనాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఈ దశలో మరోసారి ఉమ్మడి ఖమ్మంలో డేంజర్ బెల్స్ మోగాయి. భద్రాద్రి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని ఆయన సూచించారు. క్లౌడ్ బరస్ట్ వల్ల ఉన్నట్టుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ సమయంలోనైనా వర్షపాతం అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు.
ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయల్దేరారు. మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో స్థానిక అధికారుల్ని ఆయన అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మున్నేరు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరుకి మరోసారి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు డిప్యూ సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
ఇటీవల వర్షాలు, వరదలకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించలేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఖమ్మంలో పరిస్థితి దారుణంగా ఉందని, ముగ్గురు మంత్రులున్నా ఫలితం శూన్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హుటాహుటిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తాజాగా మరోసారి వరద ముప్పు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే డిప్యూటీ సీఎం భట్టి, ఖమ్మం చేరుకున్నారు.