యూకేలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం మరింత భారం మోపింది. చదువు కొనసాగుతున్న సమయంలో విద్యార్థులు తమ నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని పెంచింది. కోర్సు కొనసాగుతున్న సమయంలో నిర్దిష్ట మొత్తం తమ వద్ద ఉందని చెప్పడానికి తగు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. 2020 తర్వాత తొలిసారి బ్రిటన్ ఈ మొత్తాన్ని పెంచడం గమనార్హం. బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలు 2025 జనవరి నుంచి అమలులోకి రానున్నాయి. బ్రిటన్‌లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్థికంగా ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనలు విధించినట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
ఇంతకీ ఆ నిబంధనలు ఏమిటంటే..
లండన్‌లో ఉన్నత విద్య కోసం ప్రణాళిక చేసుకుంటున్నవారు నెలకు 1,483 పౌండ్లు (రూ.1.64 లక్షలు) సేవింగ్స్ రూపంలో తమ ఖాతాలో ఉన్నట్టు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1,334 పౌండ్లుగా ఉండగా.. దానిని దాదాపు 11 శాతం పెంచారు. లండన్ వెలుపల చదువుకునే వారికి నెలవారీ ఖర్చుల కోసం 1,136 పౌండ్లు (రూ.1.25 లక్షలు)గా నిర్దేశించారు. తొమ్మిది నెలలు అంతకంటే ఎక్కువ కాలం లండన్‌లో చదివేవారు మొత్తంగా సుమారు రూ.14.77 లక్షలు తమ సేవింగ్స్ ఖాతాలో ఉన్నట్టు వీసా సమయంలో చూపించాలి.
బ్రిటన్‌లో జీవన వ్యయం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ విద్యార్థుల నెలవారీ ఖర్చులను అంచనాలను స్థానిక ప్రభుత్వం క్రమంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది.