విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. సీబీఐ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి ఇంటర్‌పోల్ సమాచారం అందించింది. ఈ సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
బ్రెజిల్‌లోని సాంటోస్ పోర్ట్ నుంచి ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. డ్రై ఈస్ట్‌లో మిక్స్ చేసి విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీకి 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం డ్రగ్స్‌గా గుర్తించారు అధికారులు.
ఇప్పటికే సరఫరా చేసిన వారితో పాటు ప్రైవేట్ కంపెనీ వ్యక్తులపై FIR నమోదు చేశారు అధికారులు. ఇతర పదార్థాలలో కలిపి డ్రగ్స్ సరఫరా చేయడం వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందని సీబీఐ ఆరోపించింది.