ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని విస్మరించారని టీడీపీకి భుజం కాస్తున్న ప్రశాంత్ కిశోర్, జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు అంటున్నారు. పదేళ్ల పాటు నోరు మూసుకుని కూర్చున్న వీళ్లు.. ఎన్నికలు సమీపించగానే తెర మీదికొచ్చారు. రాష్ట్రం కోసం ఈ పదేళ్ల కాలంలో వాళ్లు చేసిన సూచనలు ఏమీ లేవు. రాష్ట్రం గురించి పట్టింపు ఉన్నవాళ్లయితే తరుచుగా మాట్లాడుతూ ఉండేవాళ్లు. జయప్రకాశ్ నారాయణ అయితే పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. గతంలో జగన్ పథకాలను ప్రశంసించిన ఆయన ఇప్పుడు చంద్రబాబు కోసం తప్పు పడుతున్నారు.
అసలు అభివృద్ధి అంటే ఏమిటి, దాని నమూనా ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చి ఓ వేయి మందికి ఉద్యోగాలు లభిస్తే అదే అభివృద్ధి అనుకునే స్థాయికి కుహనా మేధావులు దిగజారారు. జగన్ ప్రభుత్వం మిగతా ప్రభుత్వాల కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలను ఏమీ అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాల ఫలితాలు పైరవీలు, బ్రోకర్లు, లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే ఏర్పాటు చేశారు. వలంటీర్ల ద్వారా వాటిని లబ్ధిదారులకు నేరుగా చేరవేస్తున్నారు. దీనివల్ల సమాజంలో గుణాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ప్రజల్లో ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడింది.
ఇంగ్లీష్ మీడియం, నైపుణ్యాభివృద్ధి, పాఠశాలల ఆధునీకీకరణ, పేద పిల్లల కోసం అమలు చేస్తున్న అమ్మఒడి ఇతర పథకాల వంటివాటిని లోతుల్లోకి వెళ్లి చూస్తే వాటిని సంక్షేమ పథకాలుగా పరిగణించడానికి వీలు లేదు. నాణ్యమైన మానవ వనరులను అందించడానికి పెడుతున్న సామాజిక పెట్టుబడిగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది. పిల్లలపై పెడుతున్న పెట్టుబడి ఓ దశాబ్దం తర్వాత గానీ ఫలితాలు ఇవ్వదు. వారు ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు పొందితే ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయి. దానివల్ల ప్రభుత్వంపై ఆధారపడేతత్వం తగ్గుతుంది. దానివల్ల రాష్ట్రం ప్రగతి సాధిస్తుంది.
నిజానికి, అభివృద్ధికి ఎక్కడ కూడా ఓ ప్రత్యేక యంత్రాంగం లేదు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బటన్ నొక్కడంపైనే జగన్ ఫోకస్ పెట్టలేదు. మరోవైపు రాష్ట్రంలో అందరూ భావించే అభివృద్ధి కూడా జరుగుతూనే ఉంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కన్నా ఎక్కువే జరుగుతోంది. ఒకే కంటితో చూస్తే అవి కనిపించకపోవచ్చు. రాష్ట్రంలోకి జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను, జరుగుతున్న ఓడ రేవుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మెరుగ్గానే జరుగుతున్నాయి.