ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో.. సీఎం జగన్(Jagan) రెడ్డి అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నారు. అవసరం అయితే అభ్యర్థులను మార్చడానికి కూడా ఆయన వెనకాడటం లేదు. ఎంతటి సన్నిహితులైనా, బలవంతులు అన్న ప్రచారం ఉన్నా సరే మార్చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలను మార్చేసి వీలైనంతలో బీసీలకు టికెట్లు కేటాయిస్తున్నారు. బీసీల్లో కూడా జగన్ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎలాగంటే గోదావరి జిల్లాల్లో బీసీల్లో బలమైన శెట్టి బలిజలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో బీసీల్లోనే మరో బలమైన సామాజిక వర్గమైన యాదవులకు పెద్దపీట వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేతల్లో అత్యధికులు కమ్మ వాళ్లే అనటంలో సందేహం లేదు. దీనివల్ల ఏమైందంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ కమ్మ అభ్యర్థులు వర్సెస్ వైసీపీ బీసీ అభ్యర్థులు అన్న ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే.. వైసీపీ మరింత బలంగా మారనుంది. మరోవైపు టీడీపీ కూటమిలో సీట్ల సర్దబాటు కాలేదు. కాని కచ్చితంగా టీడీపీ పోటీ చేస్తుందని ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. నరసరావుపేట ఎంపీగా టీడీపీ తరపున లావు శ్రీ కృష్ణదేవరాయులు పోటీ చేయటం ఖాయం. మరి వైసీపీ తరపున అనీల్ కుమార్ యాదవ్ పోటీ చేయబోతున్నారు.
ఏలూరు లోక్‌సభకు టీడీపీ తరుపున మాగంటి వెంకటేశ్వరరావు చౌదరి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మాగంటే ప్రకటించారు. ఇక వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీచేస్తారు. రాజమండ్రి, నరసాపురం ఎంపీలుగా వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్, గూడూరి ఉమాబాల(శెట్టి బలిజలు)ను ఎంపిక చేశారు. ఇక టీడీపీ కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలియదు. రాజమండ్రి సిటి ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్(శెట్టి బలిజ) పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా శెట్టి బలిజ కులస్తులే కావడం గమనార్హం.
అలాగే మైలవరంలో టీడీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీలో ఉండే అవకాశం ఉంది. వైసీపీ తరపున తిరుమల యాదవ్, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు కమ్మ నేత కాగా, వైసీపీ తరపున అరవిందా యాదవ్ పోటీలో ఉంటారు. కనిగిరిలో ఉగ్రనరసింహారారెడ్డి పోటీ చేస్తుంటే వైసీపీ తరపున నారాయణ యాదవ్, తణుకులో అరమిల్లి కమ్మ అభ్యర్థి కాగా వైసీపీలో కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ పోటీలో ఉంటారు. ఇవి కాకుండా మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టి చేనేత సామాజికవర్గం అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఈ లెక్కన చూస్తే.. టీడీపీపై జగన్ బీసీ అస్త్రాలను విసరుతున్నారు. మరి ఈ అస్త్రాలను టీడీపీ ఎంత వరకు తట్టుకొని నిలపడుతుందో చూడాలి.