రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులుగా కొందరిని ఎంపిక చేసిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు నాలుగైదు ఎన్నికలను చూస్తే ధనబలం ఎలా శాసిస్తోందో అర్థమైపోతుంది. ఓసీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేయాలంటే ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే. అసెంబ్లీ అభ్యర్థి కనీసం రూ.60 కోట్లు ఖర్చు పెట్టినా గెలుపు గ్యారెంటీ లేదు. ఒకవైపు చంద్రబాబు ఎంపికను చూసిన తర్వాత కూడా జగన్ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు విచిత్రంగా ఉంది.
వైసీపీ అభ్యర్థులుగా పార్లమెంట్, అసెంబ్లీలకు జగన్ ఎంపిక చేసిన కొందరిది సాధారణ నేపథ్యమే. నెల్లూరు అర్బన్ అభ్యర్థిగా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. తనను అభ్యర్థిగా జగన్ ఎంపిక చేశారంటే ఖలీలే ముందు నమ్మలేదు. ఖలీల్ ప్రత్యర్థిగా టీడీపీ తరపున ఆర్థిక, అంగబలాల్లో అత్యంత పటిష్టమైన నారాయణ పోటీ చేస్తున్నారు. మైలవరం అభ్యర్థిగా సాధారణ రైతు, పార్టీ కార్యకర్త సర్నాల తిరుపతిరావును ఎంపిక చేశారు. టీడీపీ తరపున పోటీకి కోటీశ్వరులు దేవినేని ఉమ, వసంతకృష్టప్రసాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
మడకశిర నియోజకవర్గంలో ఉపాధిహామీ కూలీ, పార్టీ కార్యకర్త ఈర లక్కప్పను జగన్ ఎంపిక చేశారు. తనను మడకశిర అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిసి లక్కప్పే ఆశ్చర్యపోయారు. టీడీపీ తరపున ఆర్థికంగా గట్టిస్థితిలో ఉన్న కేఈ సునీల్ కుమార్‌ను చంద్రబాబు ఎంపిక చేశారు. శింగనమలలో అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ ఎం.వీరాంజనేయులును జగన్ ఎంపిక చేస్తే చంద్రబాబేమో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న బండారు శ్రావణి శ్రీని పోటీలోకి దింపారు.
నరసాపురం పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థిగా లాయర్, పార్టీ కార్యకర్త ఉమాబాలను జగన్ ఎంపిక చేస్తే ప్రత్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. కూటమిలోని ఏదో పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేసే అవకాశముందంటున్నారు. రఘురామ ఆర్థిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఖలీల్, లక్కప్ప, వీరాంజనేయులు, తిరుపతిరావు, ఉమాబాల లాంటి వాళ్ళని టీడీపీ తరపున అభ్యర్థులుగా ఎవరైనా ఊహించగలరా? రిజర్వుడు నియోజకవర్గాలైన శింగనమల, మడకశిరను వదిలేస్తే మైలవరం, నెల్లూరు అర్బన్, నరసాపురం లోక్ సభలో కోటీశ్వరులను ఢీకొట్టేందుకు పార్టీలో పనిచేస్తన్న సాధారణ కార్యకర్తలను జగన్ ఎంపిక చేశారంటే జనాలు గెలిపిస్తారన్న నమ్మకమే కారణమని చెప్పాలి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.