ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ శ్యామల వైసీపీకి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన పార్టీ సోషల్‌మీడియా నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదురైనప్పటికీ వైసీపీ తరపున తన వాయిస్ వినిపించారు. ఐతే తాజాగా శ్యామలకు పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు జగన్. ఈ పదవితో శ్యామల ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లయింది.
వైసీపీలో జగన్ మార్పులు, చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్కే రోజా, ఆరె శ్యామల, జూపూడి ప్రభాకర రావు, భూమన కరుణాకర్ రెడ్డిలను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు. ఐతే వీరిలో భూమన, జూపూడి, ఆర్కే రోజా దశాబ్ధాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కానీ, శ్యామల మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి రాజకీయ పదవుల్లో లేరు. ఇటీవలి ఎన్నికలకు ముందు వైసీపీ కోసం ప్రచారం చేశారు. పిఠాపురంలో ప్రచారం నిర్వహించిన శ్యామల పవన్‌ను నేరుగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పరోక్షంగా పవన్‌కల్యాణ్ గుంట నక్క, చంద్రబాబు తోడేలు లాంటి వాడంటూ శ్యామల చెప్పిన కథ సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
దీంతో టీడీపీ, జనసేన సోషల్‌మీడియా నుంచి శ్యామల తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా నీచమైన పోస్టులతో ఆమెను టార్గెట్ చేశారు. ఐనప్పటికీ శ్యామల వెనక్కితగ్గలేదు. వైసీపీ కోసం ఓ సైనికురాలిగా పని చేశారు. ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కీలక నేతలంతా పార్టీని వీడినప్పటికీ.. శ్యామల మాత్రం వైసీపీకే తన మద్దతు ప్రకటించారు. దీంతో ఆమెకు కీలక పదవి కట్టబెట్టారు జగన్. ఐతే ఈ కొత్తపాత్రలో శ్యామల ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
శ్యామల కాకినాడలోని ఓ బ్రాహ్మిణ్ కుటుంబంలో జన్మించారు. సీరియల్ నటుడు, కడప జిల్లాకు చెందిన నరసింహ రెడ్డిని కులాంతర వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో అవకాశాలు చేజారుతాయన్న భయం లేకుండా భార్యాభర్తలిద్దరూ వైసీపీకి మద్దతుగా నిలిచారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది శ్యామల కోరికగా తెలుస్తోంది.