జగన్-చంద్రబాబు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కరచాలనం చేసుకున్న పాత ఫొటోని టీడీపీ ఇప్పుడు వైరల్ చేస్తోంది. అసెంబ్లీలో ఇద్దరు నాయకులు కలుసుకున్న ఫొటో అది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత అసెంబ్లీలో జరిగిన సంఘటన అది. సీఎంగా చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా జగన్ తొలిసారి అసెంబ్లీలో పలకరించుకున్నారు. ఆ ఫొటోని సరిగ్గా ఇప్పుడే వైరల్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. వైసీపీ వేసిన ఓ ట్వీట్ కి కౌంటర్ గా టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఆ ఫొటోని బయటకు తీసింది.
ప్రకాశం బ్యారేజ్ ని వైసీపీ నేతలు పడవలతో ఢీకొట్టించారని, బ్యారేజ్ ని ధ్వంసం చేయాలని చూశారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కూడా ఆరోపిస్తున్నారు. పడవలను నిర్లక్ష్యంగా వదిలేశారనే కారణంతో ఇద్దర్ని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఈ కేసు ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. పడవల ఓనర్లు వైసీపీ వాళ్లేనని, వైసీపీ నేతలకు వారితో సంబంధాలున్నాయనేది టీడీపీ వాదన. అయితే టీడీపీ నేతలకే వారు బంధువులని, చంద్రబాబుతో కూడా వారు ఫొటోలు దిగారంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. లోకేష్ ని కూడా కలిశారంటోంది. ఈ ట్వీట్ కి తాజాగా టీడీపీ బదులిచ్చింది.
https://x.com/JaiTDP/status/1833371115361603626
గతంలో అసెంబ్లీలో చంద్రబాబు-జగన్ ఫొటోని టీడీపీ బయట పెట్టింది. చంద్రబాబుతో ఫొటోలు దిగినవారు ఏ తప్పు చేసినా ఆయనతో సంబంధం అంటగడతారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఆ మాటకొస్తే గతంలో జగన్ కూడా చంద్రబాబుతో ఫొటో దిగారని.. ఆయన కొట్టేసిన లక్ష కోట్ల వెనుక కూడా టీడీపీ ఉందని చెబుతారా..? అని ప్రశ్నించింది. ఇప్పటి వరకూ ఆ బోట్లతో వారికి సంబంధమే లేదని, నాలుగేళ్ల క్రితమే వాటిని అమ్మేశారని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు వారితో వైసీపీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
https://x.com/YSRCParty/status/1833059949854806307
ఇక్కడ సమస్య పడవల యజమానులు వైసీపీనా, టీడీపీనా అనేది కాదు.. అసలు పడవలతో ఢీకొంటే.. డ్యామ్ కి నష్టం ఉంటుందా..? డ్యామ్ లు ధ్వంసం అవుతాయా..? భారీ వర్షాలు, వరదలకు.. లంగరు వేసిన పడవలు కొట్టుకు వస్తే అది మానవ తప్పిదమేనా..? అనేది చర్చించాల్సిన సందర్భం ఇది. పడవలు ఢీకొన్నాయి, కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నది కాబట్టి ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అది వైసీపీ కుట్రేనంటూ ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు.