2019 ఎన్నికల వేళ.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ముఖ్యమంత్రి జగన్ లిస్ట్ చదువుతారా? ఇదిగో లిస్ట్ అని మీడియాకు రిలీజ్ చేస్తారా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో సీనియర్ బీసీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎస్సీ నాయకుడు నందిగం సురేష్‌ల చేతికి కాగితాలిచ్చారు. అభ్యర్థులను ప్రకటించమని జగన్ సూచించారు. ఒక్కసారి షాక్‌కు గురైన ఆ నేతలిద్దరూ తర్వాత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై.. సంతోషంతో గొంతు పూడుకుపోతుండగానే అభ్యర్థులందరి పేర్లూ చదివేశారు.. కట్ చేస్తే 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు గెలిచి వైసీపీ సునామీ సృష్టించింది.
అయిదేళ్ల తర్వాతా అదే సీన్
2024 ఎన్నికలు.. కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది. ఇలాంటి సమయంలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగన్ అభ్యర్థుల ప్రకటనకు వేదిక మీదకు వచ్చారు. ఈసారీ అదే ఉత్కంఠ. అభ్యర్థులను ఎవరు ప్రకటిస్తారని! కానీ అయిదేళ్లయినా సీనేమీ మారలేదు. మళ్లీ అదే ధర్మాన ప్రసాదరావు, అదే నందిగం సురేష్ వేదికపై జగన్‌కు చెరోపక్కన కూర్చున్నారు. ముందుగా ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ను ఎస్సీ నేత, ఎంపీ సురేష్ చదివారు. తర్వాత బీసీ నేత, మంత్రి ధర్మాన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. సెంటిమెంట్ వర్కవుట్ అయితే మళ్లీ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
టికెట్ ఇచ్చినదానికన్నా ఎక్కువ సంతోషం
ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అయిదేళ్ల కిందట తామే అభ్యర్థులను ప్రకటించామని, ఇప్పుడూ తమకే ఆ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చినదానికన్నా కూడా దీన్నే ఎక్కువ గౌరవంగా భావిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. తమను పక్కన నుంచున్నా చిరాకుపడే నేతల నుంచి.. భుజం మీద చెయ్యేసి కౌగలించుకుని, పక్కన కుర్చీ వేసి గౌరవించే జగనన్నతో పని చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు.