ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీయడం లేదు. అందుకే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెమటలు కక్కుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో తానేం చేయలేదో, జగన్ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో బేరీజు వేసుకుని, తన తప్పిదాలేమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నట్లు లేరు. అందుకే జగన్ ప్రభుత్వంపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గాలి విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారంటే అది తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిని లబ్ధిదారులకు అందించిన తీరు కారణం.
ప్రత్యక్ష నగదు బదిలీ(డిబీటీ) ద్వారా సంక్షేమ పథకాలను జగన్ ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో పైరవీలకు గానీ లంచాలకు గానీ తావు లేదు. ఇటువంటిది ప్రజలు గతంలో ఎప్పుడూ చూడలేదు. దాంతో లబ్ధిదారుల్లో జగన్ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి చోటు చేసుకుంది. దానికితోడు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పించన్లను అందించడం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే చేరుస్తున్నారు. ఈ సేవలను అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటి పనితీరును ఎప్పటికప్పుడు మోనిటర్ చేసే పకడ్బందీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీంతో ఎక్కడ కూడా పొరపాట్లు జరగడానికి, అక్రమాలు జరగడానికి వీలు లేకుండా పోయింది.
గత చంద్రబాబు పాలనలో ఐదేళ్ల కాలంలో అర్హులై ఉండీ పింఛన్లకు నోచుకోని వారున్నారు. ప్రభుత్వ కార్యాయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటివారిని గుర్తించి మూడు నెలలోపలే వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నారు. పింఛన్లను కొంత మందికే చంద్రబాబు ప్రభుత్వం పరిమితం చేసింది. జగన్ మాత్రం అటువంటి పరిమితి ఏదీ పెట్టుకోలేదు. అర్హులైన వారందరికీ అందేలా ఏర్పాటు చేశారు.
అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా 15 వేల రూపాయలు అందడంతో మహిళలు జగన్కు అనుకూలంగా ఉన్నారు. స్కూల్ డ్రాపౌట్స్ ను తగ్గించడానికి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది ఒకటి. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే తాము పింఛన్లను అందుకుంటున్నందుకు వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు జగన్ ప్రభుత్వం ప్రతిష్టను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు 545 రాష్ట్ర ప్రభుత్వ సేవలు, 200 కేంద్ర ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ఇంత నేరుగా, పారదర్శకంగా ఈ సేవలు ప్రజలకు అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వహించిన పాత్ర అమోఘమైంది.
కుల ధ్రువీకరణ పత్రాలు, ల్యాండ్ రికార్డుల వంటివి అందుకోవడానికి ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. వాటిని పొందడానికి నెలల తరబడి అలా తిరగాల్సి వచ్చేది. జగన్ ప్రభుత్వం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే అందుతున్నాయి. ఇందుకు వలంటీర్లు ప్రజలకు సహకారం అందిస్తున్నారు.
జగన్ నిబద్ధతకు ఆ పథకాలు, వాటిని అమలు చేసిన తీరు ప్రధాన కారణం. ప్రజలు ఇటువంటి ఫలితాలను ఏనాడూ చూసి ఉండరు.