తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ చార్జీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మేలు జరిగే విధంగా చూస్తున్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యుత్ సంస్థల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా చార్జీలను వసూలు చేయకుండా జగన్ ప్రభుత్వం తగిన సూచనలు చేస్తోంది. దాన్ని ఏపీఈఆర్సీ అంగీకరిస్తోంది
విద్యుదుత్పత్తికి సంబంధించిన చార్జీలు ఏటా పెరుగుతుండడంతో వాటికి అనుగుణంగా విద్యుత్ కొనుగోలు చార్జీలు పెరుగుతున్నాయి. దాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగా చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వానికి గానీ విద్యుత్ సంస్థలకు గానీ ఏ విధమైన ప్రమేయం ఉండదు. జాతీయ టారిఫ్ విధానం ప్రకారం గతంలో ఉన్న టారిఫ్ శ్లాబులను స్థిరీకరణ చేయడం ద్వారా శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు.
కేటగిరిలవారీగా పరిశీలిస్తే టారిఫ్ ధరలు పెరగడం లేదు. కొనుగోలు చార్జీల పెరుగుదల భారం పేదలపై పడకూడదనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు(గతంలో 100 యూనిట్లు ఉండేది), బాగా వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, క్షౌరశాలలకు 150 యూనిట్ల వరకు, రజక వినియోగదారులకు 150 యూనిట్ల వరకు, చేనేత వృత్తి వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. దోబీఘాట్లకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.
జగన్ ప్రభుత్వం రాయితీలను ఉపసంహరించలేదు. పైగా, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు రెండు కోట్ల మంది వినియోగదారులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించింది. వారిపై చార్జీల భారం పడకుండా 2024-25 టారిఫ్ ఆర్డర్‌ను ఏపీఈఆర్సీ ఆమోదించింది. మూడు డిస్కంలకు చెందిన రూ.13,589.18 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గత సంవత్సరం కన్నా ఇది రూ.3,453,96 కోట్లు అధికం.
సామాన్య విద్యుత్ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం రాయితీలను కొనసాగిస్తోంది. ప్రజలకు వెసులుబాటు కలిగించేట్లు ఏపీఈఆర్సీ నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.