ముఖ్యమంత్రి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ల కేటాయింపులో భారీ కసరత్తు చేశారు. 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. మరో 25 మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. దీని వల్ల దాదాపు 12 మంది పార్టీకి రాజీనామా చేశారు. అయినప్పటికీ పెద్దగా తిరుగుబాటు కనిపించలేదు. అంతా సాఫీగా కనిపిస్తోంది. ఎక్కడైనా కాస్తా అసమ్మతి కనిపించినా సర్దుబాటు చేసుకోవడానికి తగిన సమయం పోలింగ్ తేదీ వల్ల సమకూరింది. మే 13న పోలింగ్ జరుగుతుంది కాబట్టి అందుకు అవకాశం చిక్కింది.
ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీట్ల పంపకం, కేటాయింపులు సరిగా జరగలేదు. ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో, ఈ సీటుకు ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తారో తెలియక తీవ్రమైన అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ముందస్తు ప్రణాళిక వల్ల, అభ్యర్థుల ఎంపిక వల్ల ప్రచారానికి తగిన సమయం చిక్కింది. ప్రత్యర్థులు వెనకబడిపోయారు.
వైఎస్ జగన్ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అభ్యర్థులను ఎంపిక చేసిన చోట అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ టీడీపీ, జనసేనల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. విజయావకాశాలు లేని సీట్లను టీడీపీ తమ పార్టీకి కేటాయించిందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
వైసీపీ టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు..
91 మంది సిట్టింగ్ ఎమ్యెల్యేలకు వైఎస్ జగన్ తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెట్టి పల్గుణ (అరకు), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం), ఉన్నమట్ల ఎలిజా (చింతలపూడి), రక్షణనిధి (తిరువూరు), టిజెఆర్ సుధాకర్ బాబు (సంతనూతలపాడు), టి. ఆర్థర్ (నందికొట్కూర్), సుధాకర్ (కొడమూరు), జొన్నలగడ్డ పద్మావతి (సింగనమల), ఎం. తిప్పే స్వామి (మడకశిర), వరప్రసాద్ (గూడురు), ఎంఎస్ బాబు (పూతలపట్టు), టి. నాగిరెడ్డి (గాజువాక), నవాజ్ బాషా (మదనపల్లి), హఫీజ్ ఖాన్ (కర్నూలు), పెండెం దొరబాబు (పిఠాపురం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), మాడిశెట్టి వేణుగోపాల్ (దర్శి), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్)లకు తిరిగి పోటీ చేసే అవకాశం దక్కలేదు.
ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి), చెన్నకేశవ రెడ్డి (ఎమ్మిగనూరు), మానుగుంట మహీధర్ రెడ్డి (కందుకూరు), పీవీ సిద్ధారెడ్డి (కదిరి), మేడా మల్లికార్జున్ రెడ్డి (రాజంపేట), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), కె. భాగ్యలక్ష్మి (పాడేరు)లకు కూడా జగన్ టికెట్లు నిరాకరించారు.
సీట్లు మారిన వైసీపీ ఎమ్మెల్యేలు..
వైఎస్ జగన్ 15 మంది ఎమ్మెల్యేల స్థానాలను మార్చారు. గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి నుంచి గాజువాకకు, కంబాల జోగులును రాజం నుంచి పాయకరావుపేటకు, తానేటి వనితను కొవ్మూరు నుంచి గోపాలపురానికి, తలారి వెంకటరావును గోపాలపురం నుంచి కొవ్వూరుకు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమహేంద్రవరం రూరల్‌కు, జోగి రమేష్‌ను పెడన నుంచి పెనమలూరుకు, వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్‌కు, మేకతోటి సుచరితను ప్రత్తిపాడు నుంచి తాడికొండకు, విడదల రజినిని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు, మేరుగు నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకు, కుందూరు నాగార్జున రెడ్డిని మార్కాపురం నుంచి గిద్దలూరుకు, అన్నా రాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురానికి మార్చారు.
మంత్రి ఆదిమూలపు సురేష్‌ను యెర్రగొండపాలెం నుంచి కొండిపికి, బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కనిగిరి నుంచి కందుకూరుకు, కెవీ ఉషా శ్రీచరణ్‌ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మార్చారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు ఎంపీ సీటుకు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను నర్సారావుపేట లోకసభ సీటుకు, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణను అనంతపురం లోకసభ సీటుకు ఎంపిక చేశారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభకు పంపించారు.
మొత్తంగా వైఎస్ జగన్ లెక్క ప్రకారం సీట్ల కేటాయింపులు జరిపితే చంద్రబాబు మాత్రం తడబడుతూ వ్యవహరించారు. పార్టీ నాయకత్వంతో సహకరించాలని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానాలు కల్పిస్తామని చంద్రబాబు అసమ్మతి నేతలకు విజ్ఞప్తి చేశారు. అయినా అసమ్మతులు చల్లారడం లేదు. జనసేనలోనూ అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. రెండు పార్టీల్లోనూ పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.