“చంద్రబాబూ, మీ పార్టీ నాయకులకు కూడా ఇదే గతిపడుతుంది జాగ్రత్త, మీ నాయకులు ఇదే జైలులో ఉంటారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టిన తప్పుడు సంప్రదాయం ఒక సునామీ అవుతుంది, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు.” అంటూ మాజీ సీఎం జగన్, సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించేందుకు గుంటూరు సబ్ జైలుకి వెళ్లిన జగన్.. మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.
https://www.youtube.com/live/p4-UGxjqdm4?si=lAu0LquKA9Sai7Zd
ఏపీలో ఇంత దుర్మార్గ పాలన గతంలో ఎప్పుడూ లేదన్నారు జగన్. తన పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి చంద్రబాబు పాత కేసుల్ని తెరపైకి తెస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే బెజవాడ మునిగిందన్నారు. ఆ తప్పుని డైవర్ట్ చేసేందుకు నందిగం సురేష్ పై ఉన్న నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారన్నారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ఘటనలో అసలు నందిగం సురేష్ ఉన్నారా..? సీసీ టీవీ ఫుటేజ్ లో ఆయన ఎక్కడైనా కనిపించారా అని సూటిగా ప్రశ్నించారు జగన్. అక్రమ కేసులు పెట్టడం తప్పుడు సంప్రదాయం అని, ఇప్పటికైనా చంద్రబాబు ఆ పద్ధతి మానుకోకపోతే అది కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నేత బోసిడీకే అని దూషించారని.. అయినా కూడా తాము కక్షసాధింపులకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు జగన్. ఆయనకు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు తమ పార్టీ నేతల్ని అక్రమంగా నోటీసులివ్వకుండా అరెస్ట్ చేస్తున్నారని, పరారీలో ఉన్నారంటూ కొంతమందిపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు జగన్. రెడ్‌బుక్ అంటూ బెదిరించడం ఘనకార్యం కాదని చెప్పారు. పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్ పైనే చంద్రబాబు దృష్టిపెట్టారని దీనికి ఫలితం అనుభవించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.