ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎంఎస్ నారాయణ చెప్పిన ఈ డైలాగ్ సూపర్ హిట్. కానీ అదే పవన్ కళ్యాణ్ సినిమాలు దాటి రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎక్కడ తగ్గాలో కాదు.. ఎంత తగ్గాలో తెలియక రోజురోజుకీ పడిపోతున్నాడు. జగన్‌ను దింపాలన్న మంకుపట్టుతో ఎన్ని సీట్లు ఇస్తామన్నా పొత్తుకు ఒప్పుకుని ఇంకా ఇంకా తగ్గిస్తున్నా కూడా నోరెత్తలేని స్థితికి పడిపోతుండటాన్ని ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
75.. 50.. 24… 21 ఇంకెంత తగ్గాలి?
100 సీట్లలో టీడీపీ, 75 సీట్లలో జనసేన పోటీ చేయాలి.. ఇదీ హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతల ఆకాంక్ష. ఆ మాత్రం సీట్లలో పోటీ చేస్తేనే పొత్తులో సమఉజ్జీలుగా ఉంటారన్నది రాజకీయ విశ్లేషణ. జనసేన నేతలూ అలాగే కాంక్షించారు. కానీ టీడీపీ గీచిగీచి బేరాలాడుతూ వచ్చింది. 50 సీట్లనుకుంటే అనూహ్యంగా 24 సీట్లే విదిల్చింది. ఇప్పుడు అందులోనూ మరో మూడు సీట్లు బీజేపీకి ఇప్పించేసింది. తాను మాత్రం దగ్గరుంచుకున్న 145 సీట్లలో ఒక్క సీటు బీజేపీకి ఎక్స్‌ట్రాగా ఇచ్చి పొత్తు ధర్మం కోసం బోల్డంత త్యాగం చేసినట్లు అనుకూల మీడియాలో కలరింగ్ ఇచ్చుకుంటోంది.
నువ్వొక్కడివే ఎందుకు త్యాగం చేయాలన్నా?
జగన్‌ను దించేయాలి.. లేకుంటే రాష్ట్రం మనుగడ కష్టమంటున్న పవన్ కళ్యాణ్ దానికి త్యాగాలకు సిద్ధపడాలని తమకు చెబుతున్నారని, అదే పంతం తెలుగుదేశానికి కూడా ఉన్నప్పుడు వారు కూడా త్యాగాలు చేయాలి కదా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో గెలుపు తమకంటే టీడీపీకే జీవన్మరణ సమస్య అని, వాళ్లేమో గట్టు మీద కూర్చుని మమ్మల్ని ముంచేస్తున్నారని జనసైనికులు వాపోతున్నారు. ఈ విషయం తెలిసినా తమ సేనాని తమ భవిష్యత్తునే బలిపెడుతున్నారన్నది వారి ఆవేదన.