ఏపీలో భారీ వర్షాలు ప్రజలకు, ప్రభుత్వానికి చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చాయి. విజయవాడ, గుంటూరులో సేఫ్ జోన్ లో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా ఈ వర్షాలకు నీటమునిగాయి. వర్షం పడితే ఏపీ రాజధాని ఎంత సేఫ్ అనే విషయంపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక కృష్ణానది కరకట్టపై ఉన్న ఆక్రమణలు ఈ వర్షాలకు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టాయి.
కృష్ణానది కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి విషయంలో గతంలో కూడా విమర్శలు వినిపించాయి. అప్పట్లో కృష్ణా నది వరదనీటిని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఇంటివైపు మళ్లించారని ఆధారంలేని ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. తాజా వర్షాలకు కూడా ఆ ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో కరకట్ట నివాసం.. లింగమనేని ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అంతే కాదు కరకట్టపై ఉన్న మరికొన్ని ఆక్రమణల బండారం కూడా ఇప్పుడు బట్టబయలైంది. ఇందులో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం కూడా ఒకటి.
కృష్ణానది కరకట్టపై ప్రకృతి వైద్యాలయం పేరుతో మంతెన సత్యనారాయణ రాజు ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా అని అంటారు కానీ, అక్కడకు వచ్చేవారంతా బడాబాబులే. కరకట్టపై ఉన్న ఆశ్రమంలో తమ సమస్యలు తగ్గేంత వరకు వీరు సేదతీరుతారు. ఈ ఆశ్రమం కూడా కరకట్టను కబ్జాచేసి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రకృతి వైద్యాలయానికి అన్ని అనుమతులు ఇవ్వడం విశేషం. వైసీపీ హయాంలో ఆరోపణలు బలంగా వినిపించినా మంతెన వారు ఎలాగోలా కవర్ చేసుకున్నారు. తాజా వర్షాలకు ఆ ఆశ్రమం నీటమునగడం విశేషం.
కృష్ణానది కరకట్ట లోపల 4.75 ఎకరాల్లో ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారు మంతెన సత్యనారాయణ రాజు. నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకి చెందిన స్థలం అది. ఆయన వద్ద స్థలం తీసుకుని సత్యనారాయణ రాజు ఆశ్రమం నిర్మించారు. ఈ ఆశ్రమంలోకి ఇప్పుడు వరదనీరు చేరింది.
బెజవాడపై ఉరిమిన బుడమేరు..
వరద ఉధృతికి బుడమేరు 11 గేట్లు ఎత్తివేయడంతో బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగిపోయి వరదనీరు నగరంలోకి పోటెత్తింది. షాబాదు, గొల్లపూడి రోడ్, సితార సెంటర్, మిల్క్ ఫ్యాక్టరీ, ఊర్మిళా నగర్, నందమూరి నగర్,ఇందిరా నాయక్ నగర్, ఆంధ్రప్రభకాలనీలను బుడమేరు వరద ముంచెత్తింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా వరదనీటిని విడుదల చేయడంతో కాలనీవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. దీన్ని అనుకోని విపత్తు అని సరిపెట్టుకోలేమని, ప్రభుత్వ వైఫల్యం వల్లే నష్టం మరింత పెరిగిందని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.