తెలంగాణలో వరదబాధితుల సహాయార్థం ఫుడ్ కోర్ట్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ రూ.50వేలు విరాళంగా ప్రకటించారు. ఆ విరాళం చెక్కుని ఆమె స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలసి అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు శాలువా కప్పి సత్కరించారు.
గతంలో కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు ఆమె హోటల్ ని కొన్నిరోజులు మూసివేయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అప్పట్లోనే రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నేరుగా కలసి ఆయన చేసిన మేలుకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో వరద బాధితులకు తనకు తోచిన సాయం చేస్తున్నట్టు చెప్పారు.
కుమారి ఆంటీ హోటల్ హైదరాబాద్ లో బాగా ఫేమస్. సోషల్ మీడియా ద్వారా ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో పాపులర్ కావడంతో చాలామంది సినిమా నటులు, సెలబ్రిటీలు ఆమె హోటల్ కు వచ్చి ఫుడ్ రుచి చూసేవారు. అలా ఆమె మరింత పాపులర్ అయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం హోటల్ వల్ల ఎలాంటి గందరగోళం జరగడం లేదు. కుమారి ఆంటీ కొన్ని రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నారు.