తెలుగుదేశం పార్టీ, జనసేన నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. రెండుపార్టీల నేతలతో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశం గురువారం జరిగింది. నిజానికి సమన్వయ సమావేశం ఏర్పాటులోనే సమన్వయం లోపించింది. ఎలాగంటే.. రెండుపార్టీల మధ్య పొత్తు కుదరాలంటే తేలాల్సింది ముఖ్యంగా రెండు పాయింట్లు. అవేమిటంటే పోటీచేసే సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవనే విషయం. 175 సీట్లలో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేస్తుంది, జనసేన ఎన్నిసీట్లలో పోటీచేయాలి అన్నది మొదటి పాయింట్. సీట్ల సంఖ్య తేలితే తర్వాత పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవని.
ఇవిరెండు తేలకుండానే రెండుపార్టీల నేతల మధ్య సమన్వయ సమావేశాలు ఏమిటో అర్థం కావటంలేదు. ఇప్పుడు జరిగింది రెండో సమావేశం. మొదటి సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయో ఎవరికీ తెలీదు. రెండు పార్టీల మధ్యే సీట్ల సర్దుబాటు కుదరక నానా అవస్థలు పడుతున్నారు. ఇంతలో సడన్ గా మూడో పార్టీ బీజేపీ దూరింది. కూటమి గెలుపు కోసమే బీజేపీ దూరిందా లేకపోతే గెలుపు అవకాశాలను దెబ్బకొట్టడానికే చేరిందా అనే సందేహాలు తమ్ముళ్ళలో పెరిగిపోతున్నాయి.
దీనికి కారణం ఏమిటంటే.. చంద్రబాబు నాయుడును ఈనెల 6వ తేదీన ఢిల్లీకి పిలిపించుకుని పొత్తు విషయమై చర్చ జరిపిన అమిత్ షా ఇంతవరకు దానిపై నోరెత్తలేదు. మార్చి మొదటివారంలో కాని పొత్తులపై తమ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోదని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. రోజు గడిచేకొద్దీ చాలా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన పార్టీల నేతల్లో గొడవలు పెరిగిపోతున్నాయి. పొత్తులెప్పుడు తేలుతాయి, సీట్ల సర్దుబాటు ఎప్పుడవుతుంది, ఆయా పార్టీలు అభ్యర్థులుగా ఎవరిని దింపాలి ? అనేది తేలేందుకు ఇంకా చాలా కాలం పట్టేట్లుంది.
రెండుపార్టీల నేతల మధ్యే కుదరని సమన్వయం మూడో పార్టీ బీజేపీ నేతలు కూడా చేరితే ఇంకేమవుతుందో చెప్పలేకపోతున్నారు. పొత్తు, సీట్ల సంఖ్య, పోటీచేసే నియోజకవర్గాలు ఫైనల్ అయిన తర్వాత కదా ఉమ్మడి మ్యానిఫెస్టో, ఉమ్మడి ప్రచారం లాంటివి ఫైనల్ చేయాల్పింది. అంటే టీడీపీ, జనసేన పార్టీల నేతలు రివర్సులో నడుస్తున్నారని అర్థమవుతోంది. ముందు చేయాల్సింది చేయలేక, తర్వాతెప్పుడో చేయాల్సిన కసరత్తును ముందే చేసేయాలని రెండు సమావేశాలు జరపటమే విచిత్రంగా ఉంది.